హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ప్రకటించారు. బస్‌లో కాన్పు చేసిన ఆశాకార్యకర్త మల్లి కాంతమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాదిపాటు ఉచితంగా ప్రయాణించే బస్‌పాస్ జారీ చేస్తున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. గర్భిణి సువర్ణ నాగర్‌కర్నూల్‌లో వైద్య పరీక్షలు ముగించుకుని హైదరాబాద్-కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్ బస్సులో 15న సొంతూరికి పయనమైంది. పెద్ద కొత్తపల్లి మండలం అదిరాల గ్రామ సమీపంలో బస్సులోనే ఆమెకు పురిటినొప్పులు రాగా, ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మ ఆమెకు పురుడుపోయగా, ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కండక్టర్ రాజ్‌కుమార్, బస్‌డ్రైవర్ వేణుగోపాల్, ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మను సజ్జనార్ సన్మానించారు. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లికి చెందిన సువర్ణ గ్రూప్-1 ఫలితాల్లో 179వ ర్యాంకు సాధించారు.