హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే(టాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు భారత హై కమిషనర్ పెరియసామి కుమారన్ హాజరై తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు తెలంగాణ జానపద, సాంస్కృతిక గీతాలు ఆలపించారు. మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. అతిథులు, హాజరైన ఎన్ఆర్ఐలకు టాక్ బాధ్యులు హైదరాబాద్ బిర్యానీ రుచి చూపించారు. వేడుకల్లో భారత సంతతి తెలంగాణ వాస్తవ్యులు లార్డ్ ఉదయ్ నాగరాజు, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేశ్ బుడగం, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, టాక్ కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ గణేశ్ కుప్పాల, టాక్ బాధ్యులు నవీన్‌రెడ్డి, స్వాతి, అబ్దుల్ ఖుద్దూస్, నవ్య కుప్పాల, కుమారి తన్మయ తదితరులు పాల్గొన్నారు.