Telangana | హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జూన్ 2వ తేదీన గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. అక్కడ్నుంచి నేరుగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఈ వేడుకలకు దాదాపు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.
జూన్ 2 వతేదీన సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ నిర్వహించనున్నారు.