హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యానవన శాఖ అధికారుల తీరు అధ్వానంగా తయారైంది. అధికారులు కేవలం కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ మరిచారనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు తగ్గాయని, రాష్ట్రంలో ఉద్యానసాగు వెలవెలబోతున్నదని గణాంకాలు చెబుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఓవైపు నిధుల లేమితో ఉద్యానశాఖ కునారిల్లుతుండగా.. రాష్ట్రస్థాయిలో అధికారులు మాత్రం రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వనరులను వృథాగా వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరాలు, పట్టణాల్లో కూరగాయలు, పూల సాగును ప్రోత్సహించేందుకు అత్యాధునిక పద్ధతిలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ -సీఈవో ’కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో కూరగాయలు, పూల మొక్కలు పెంచి వాటిని నగర ప్రజలకు సీజన్లవారీగా సరఫరా చేసేది. దీనివల్ల పట్టణాలు, నగరాల్లో పెద్దఎత్తున మిద్దె తోటల సాగు పెరిగింది. మరోవైపు ఈ కేంద్రాలు మొక్కలు, కూరగాయలు, పూలను విక్రయించడం ద్వారా ఉద్యానశాఖకు ఆదాయం సమకూరేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు జీడిమెట్ల, పబ్లిక్ గార్డెన్స్ వద్ద 20 మీటర్ల విస్తీర్ణంతో రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మీటర్‌కు రూ.1,000ల వ్యయంతో పాలీహౌస్‌లు ఏర్పాటు చేసింది. దాదాపు ఒక్కో పాలీహౌస్ ఏర్పాటుకు రూ.5 నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో విదేశీ రకం పూలు, కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల రైతులకు వివిధ రకాలైన కూరగాయలు, పూల నారును రైతులకు సబ్సిడీపై సరఫరా చేసేది. దీని ద్వారా సీఈవోలకు ఆదాయం సమకూరేది. ఫలితంగా పదుల సంఖ్యలో కూలీలకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉపాధి కలిగేది. ప్రస్తుతం ఆ ఉపాధి మొత్తం పోయిందని కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యానవన శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. పబ్లిక్‌గార్డెన్స్ పరిసరాల్లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రం. సుమారు 10 వేల మీటర్ల విస్తీర్ణంలో అప్పటి ప్రభుత్వం అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో అప్పట్లో విధులు నిర్వహించిన అధికారులు ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ రకం వంగడాలతో ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. ముఖ్యంగా ఆగ్రోస్ ఆవరణలో అర్బన్ ఫార్మింగ్ విభాగం అధికారులు ప్రయోగాత్మకంగా మిద్దె తోటల పెంపకం పథకాన్ని రూపొందించి అమలు చేశారు. దాదాపు నెలలో 3 వేలకుపైగా యూనిట్లు ఏర్పాటు చేశారు. కానీ రెండున్నరేండ్లుగా అధికారులు ఒక్క కొత్త పథకాన్ని కూడా రూపొందించకపోయారు. అంతేకాకుండా పబ్లిక్ గార్డెన్లో శాసనమండలి, అసెంబ్లీ మధ్యలో ఏర్పాటు చేసిన పాలీ హౌస్‌లో దేశంలోనే మొదటిసారిగా అంటుకట్టు పద్ధ్దతిలో వంకాయ, టమాటాను సాగు చేసి చూపించారు.డెకరేషన్ మొక్కలను పెంచి నగర ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేసిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత అధికారుల తీరుపై ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. ఉద్యానశాఖ డైరెక్టర్, అర్బన్ ఫార్మింగ్‌ను పర్యవేక్షించే ఉన్నతాధికారుల కార్యాలయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయం పరిసరాల్లోనే ఉంది. ఇలాంటి చోటే అధికారులు బాధ్యతారహితంగా ఉంటే.. రాష్ట్రంలో ఉద్యాన సాగు విస్తరణ ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తిరిగే ప్రదేశంలో విలువైన పాలీ హౌస్‌ల నిర్వహణను పట్టించుకోకుండా ఉండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.