హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని చిన్నారులు, మహిళలకు పోషకాహారాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. పోషకాహార పంపిణీకి సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారని, ఆయన ప్రత్యేక చొరవతోనే దేశంలో ఎకడాలేని విధంగా తెలంగాణలో పిల్లలకు బాలామృతం లాంటి పోషకాహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్లాంట్ 1975లో నిర్మితమైందని, రానున్న తరాలకు మరింత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు నాచారంలోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో రూ.42 కోట్లతో మరో ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని వివరించారు.
ఈ ప్లాంట్ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా గంటకు 4 టన్నుల పౌష్టికాహారం ఉత్పత్తి అవుతుందని రాజీవ్‌సాగర్ వివరించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం విజయలక్ష్మి, మేనేజర్లు కృష్ణవేణి, శ్రీనివాస్‌నాయక్, ప్రాసెసింగ్ మేనేజర్ ఎలమంద, మార్కెటింగ్ మేనేజర్ వెంకటయ్య, డిప్యూటీ మేనేజర్లు కోటేశ్వరరావు, బాబు తదితరులు పాల్గొన్నారు.