భోపాల్: గిరిజన ప్రజలు ముఖ్యంగా మహిళలు గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసన చేస్తున్నారు. దేశంలోని తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ వల్ల తమ ఉనికి కోల్పోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. (tribals protest) మెడకు ఉరితాళ్లు తగిలించుకోవడంతో పాటు చితిపై పడుకుని, నడుం లోతు నీటిలో నిల్చొని నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని తొలి నదుల అనుసంధాన కార్యక్రమం ఊపందుకున్నది. రూ.44,605 కోట్ల వ్యయంతో కెన్-బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్ట్ చేపడుతున్నారు.
కాగా, మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాకు చెందిన గిరిజనులు ఈ ప్రాజెక్ట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయ భూములు, అడవులు, నీటి వనరులు, జీవనోపాధి, సాంస్కృతిక గుర్తింపును తాము కోల్పోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. పూర్తి నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, ఆందోళన చేస్తున్న తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పలు కుటుంబాలను అధికారిక పునరావాస జాబితాల నుంచి మినహాయించినట్లు ఆరోపించారు.

Tribals Protest
మరోవైపు భూములు కోల్పోవడం, పునరావాసం, నష్ట పరిహారం వంటి డిమాండ్ల కోసం జై కిసాన్ ఆర్గనైజేషన్ నాయకుడు అమిత్ భట్నాగర్ నేతృత్వంలో ఈ ప్రాంత గిరిజనులు గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని, చితిపై పడుకుని, బరన్ నదిలో నడుము లోతు నీటిలో నిలబడి నిరసన తెలియజేస్తున్నారు. కేవలం నష్టపరిహారం కోసం మాత్రమే కాకుండా, తరతరాలుగా ఇక్కడి భూమిపై తమ మూలాలను నిలుపుకునే హక్కు కోసం తాము పోరాడుతున్నామని వారు చెబుతున్నారు.
ఈ ప్రాంత గిరిజనుల ఆందోళనలు, నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో వీరి ఆందోళనలు తీవ్రమయ్యాయి. అయితే గిరిజనుల ఆరోపణలను అధికారులు ఖండిస్తున్నారు. అలాగే వారితో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు, వారి డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.