Smart Ration Cards | ఢిల్లీ: క్యూఆర్ కోడ్ (QR Code)లు, ముఖ గుర్తింపు (Face Recognition)తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు శుక్రవారం తెలిపారు. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులు, డ్లూప్లికేట్ ఎంట్రీలు, బ్లాక్ మార్కెటింగ్, సబ్సిడీ ఆహార ధాన్యాల దారి మళ్లింపులను అరికట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా మారుతుందని అన్నారు. స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (Smart-PDS)ను ఢిల్లీ అంతటా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని వెల్లడించారు.
దీని ద్వారా లబ్ధిదారులు తమ రేషన్ ఎప్పుడు విడుదలైంది, ఏ చౌకధరల దుకాణానికి చేరింది, ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయాలు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్లోనే అనేక సేవలను పొందవచ్చు. రేషన్ కార్డుదారులు తమ కుటుంబ సభ్యుడి పేరును చేర్చడం, తొలగించడం, కావాల్సిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం, దరఖాస్తు పూర్తయిందా లేదా వంటివి ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సెల్ఫోన్ల ద్వారా కూడా తమకు కేటాయించిన ఆహార ధాన్యాల రవాణాను పర్యవేక్షించవచ్చు.
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్, డిజిటల్ ధ్రువీకరణ వంటివి కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చనున్నారు. రేషన్ కార్డు ప్రామాణికతను తనిఖీ చేయడానికి, నకిలీ,డూప్లికేట్ తదితర విషయాలను గుర్తించడానికి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులకు సాధ్యమవుతంది. కొంతమంది రేషన్ కార్డు లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్ పరికరాలపై సరిగ్గా సరిపోలవు. అలాంటివారి కోసం ముఖ గుర్తింపు (Face Recognition) టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థ కోసం 16 మంది సభ్యులతో కూడిన ‘యూజర్ యాక్సప్టెన్స్ టెస్టింగ్ (UAT) కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో 13 జిల్లాలకు చెందిన అసిస్టెంట్ కమిషనర్లు, ఫుడ్ సప్లయ్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు.