హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా, ఆర్థికంగా దళిత క్రైస్తవులు అభివృద్ధి చెందడం ఇష్టంలేకనే బీజేపీ సరార్ ఉద్దేశ పూర్వకంగా కుట్రలు చేస్తున్నదని గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇతర మతాలను, దళిత క్రైస్తవులను అణగదొకాలని బీజేపీ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ మతాన్నయినా నమ్ముకొనే స్వాతంత్రం ప్రజలకు ఉంటుందని, ఈ నేపథ్యంలో క్రైస్తవ మతంలోని దళితులకు కూడా రిజర్వేషన్ ఇచ్చి వారి ఎదుగుదలకు సాయం చేయాలని కోరారు.
2004లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎస్సీ హోదాకు మతంతో సంబంధం లేదని సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టంలేకనే కేంద్రంలోని బీజేపీ సరారు ఆ నివేదికలో తప్పులున్నాయని సుప్రీం కోర్టుకు చెప్పిందని మండిపడ్డారు. ఆర్థిక వెనుకబాటుతనం శాపం కావొద్దని అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, అత్యంత నిమ్న కులమైన దళితులు మతంమారితే వారిని దళితులుగా గుర్తించలేమనే తీర్పు ఇవ్వడం విచారకమన్నారు. ఇకనైనా కేంద్రం మనసు మార్చుకోవాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రాజీవ్ సాగర్ హెచ్చరించారు.