హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపక శాఖ సిగలో మరో కలికుతురాయి చేరనున్నది. 360 డిగ్రీల్లో తిరుగుతూ.. మనిషికంటే వేగంగా మెట్లెక్కుతూ.. కణకణమండే అగ్నికీలల్లోకి సైతం దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న రోబో ఫైర్ ఫైటర్‌ను సీఎం కేసీఆర్ సూచన మేరకు కొనుగోలు చేసేందుకు తెలంగాణ అగ్నిమాపక శాఖ సమాయత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి నేతృత్వంలోని ఫైర్ విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులకు ఢిల్లీకి చెందిన మిత్రాస్ కంపెనీ రోబో ఫైర్ ఫైటర్‌తో డెమో ఇచ్చింది. 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనూ దీని రిమోట్ సెన్సార్స్ పనిచేస్తాయని కంపెనీ డైరెక్టర్ అనిల్ మిత్రా వివరించారు.
వై నాగిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆధునిక వాహనాలు, ఇతర వస్తు సామగ్రిని సమకూర్చుకొనేందుకు ప్రభుత్వానికి రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ఫైర్ ఫైటింగ్ రోబోలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. నిధులు మంజూరుకాగానే అన్నీ సమకూర్చుకొంటామని వెల్లడించారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ లక్ష్మీనారాయణ, అడిషనల్ డైరెక్టర్ నారాయణరావు, రీజినల్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఎఫ్‌ఓలు, కంపెనీ ప్రతినిధులు దేవేందర్, రమణ, మంకేశ్, కిషన్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.