హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతిని చూసి గర్విస్తున్నామని అసెంబ్లీలో ప్రతిపక్షనేత, ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఒకప్పుడు ఆహారధాన్యాల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇతర ప్రాంతాలే మన మీద ఆధాపడుతుండటం గర్వంగా ఉన్నదని పేర్కొన్నా రు. ఇంతటి ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నదని ప్రశంసించారు. కొవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదని గుర్తుచేశారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తులకు అనుగుణంగా గోదాముల నిర్మాణాలు చేపట్టడం గొప్ప విషయమని కీర్తించారు.
మైనార్టీలకు ప్రాధాన్యం
తెలంగాణలో ముస్లిం, మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యం మరే రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఒక్క తన నియోజకవర్గంలోనే రూ.1.96 కోట్లు ఇచ్చారని వెల్లడించారు. రెండో రాష్ట్ర భాషగా ఉర్దూను గుర్తించిన తెలంగాణలో ఉన్నందుకు గర్విస్తున్నామని చెప్పారు. ఎంఐఎం ఏమి సాధించిందని ప్రశ్నించేవారికి ఇదే తమ సమాధానమని స్పష్టంచేశారు. సెక్యులరిజం పేరుతో డప్పు కొట్టే రాజకీయ పార్టీలు ఏ రాష్ట్రంలోనైనా ఉర్దూకు రెండో భాషగా గుర్తింపు ఇచ్చాయా? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో పాతబస్తీకి రూ.200 కోట్ల ప్యాకేజీ ఇస్తే.. ఇప్పుడు ప్యాకేజీకి బదులు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధి భేష్: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశంసించారు. మన జీఎస్డీపీ 11.5 శాతానికి పెరగడం గొప్ప విషయమని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయకోణంలో చాలామందికి న్యాయం జరిగేలా చూస్తున్నారని, దీనిని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో సంక్షే మ కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. మరిన్ని అమలుచేయాల్సిన అససరమున్నదని చెప్పారు. మొన్న సీఎం కేసీఆర్ చెప్పినవిధంగా అన్ని గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించాలని ఆకాంక్షించారు.