హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంట దిగుబడులకు మద్దతు ధర దేవుడెరుగు.. అసలు కొనేదిక్కే లేకుండా పోయింది. పంట దిగుబడులను మార్కెట్లలో పోసి కొనుగోళ్ల కోసం కొండకెదురు చూసినట్టు అన్నదాతలు ఎదురు చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. ఫలితంగా రైతుల పరిస్థితి అధోగతి పాలవుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జొన్న, మక్క, శనగ, పొద్దుతిరుగుడు రైతులు గగ్గోలు పెడుతున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఆయా పంటలు పండించిన రైతులకు శాపంగా మారింది. కోతలు మొదలై రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే లేదు. పైసల్లేవంటూ అసలు కొనుగోళ్ల నుంచే తప్పించుకొనేందుకు సర్కార్ కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఓవైపు బహిరంగ మార్కెట్లో ధర దక్కడంలేదు, మరోవైపు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకొన్నా కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయక బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సర్కార్‌పై నమ్మకం కోల్పోయిన కొంత మంది రైతులు తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు తమ పంటలు విక్రయిస్తున్నారు. తద్వారా భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కార్‌కు పంటలు కొనుగోలు చేసే ఉద్దేశమే లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడమే సర్కార్ విధానాన్ని స్పష్టం చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైనా మార్క్‌ఫెడ్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్న, మక్క, శనగ పంటలను కొనుగోలు చేసేది. కానీ ప్రస్తుతం ఆ పని చేయడమే లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జొన్న పంట కోతలు మొదలయ్యాయి.వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఈ సీజన్లో 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగయింది. ఇప్పటికే 30శాతం కోతలు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. రైతులు తమ పంట దిగుబడులు ఎక్కడ అమ్మాలో తెలియక సతమతం అవుతున్నారు.
శనగ కొనుగోలును ప్రారంభించినట్టు ప్రారంభించి మధ్యలోనే నిలిపేసింది. కేంద్ర ప్రభుత్వం 24వేల టన్నుల కొనుగోలుకు అనుమతిచ్చింది. ఆ కోటా పూర్తికాగానే మిగతా పంటను రాష్ట్ర ప్రభుత్వం కోటాలో కొనుగోలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో మార్క్‌ఫెడ్ అధికారులు శనగ కొనుగోళ్లను అర్ధాంతరంగా నిలిపివేసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే గానీ మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించే పరిస్థితి లేదు.
మక్కజొన్న రైతుల గోస అంతా ఇంతా కాదు. ఇప్పటికే 50 శాతం మక్క కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయినా ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించనే లేదు. రైతులు ఎంత వేడుకున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మక్క కొనుగోళ్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిలదీయడంతో హడావుడిగా కొనుగోలును ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. సుమారు 200 కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 80 కేంద్రాలనే ప్రారంభించడం గమనార్హం. ఈ సీజన్లో 15 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా 30 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ కేవలం కొనుగోలు చేసిన మక్కలు 15 వేల టన్నులు మించలేదని తెలిసింది.
ఎన్నికలకు ముందు ప్రతి పంటనూ మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని, కొన్ని పంటలకు అదనంగా బోనస్ కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రగల్భాలు పలికింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కేసింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తే అదే మహాభాగ్యమనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర దక్కడం లేదు. మార్కెటింగ్ శాఖ రోజువారీ కొనుగోలు వివరాల ప్రకారం.. మక్కజొన్నకు క్వింటాకు మద్దతు ధర రూ.2,400 ఉండగా.. మార్కెట్లో రూ.1,600 లోపే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జొన్నలకు మద్దతు ధర రూ.3,699 ఉండగా..రూ.2వేల లోపే కొంటున్నారు. శనగకు మద్దతు ధర రూ.5,875 ఉండగా.. మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు రూ.5వేలలోపే ధర చెల్లిస్తున్నారు.
‘పైసల్లేవ్.. ఎక్కువగా పంట దిగుబడులు కొనొద్దు’ అంటూ మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు మార్క్‌ఫెడ్ అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే మార్క్‌ఫెడ్ అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొనుగోళ్లలో కోత పెడుతున్నట్టు తెలిసింది. ఇందుకు మక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర జాప్యమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మక్కజొన్న, జొన్న, శనగ కేంద్రాలను ప్రారంభిచడంలో జాప్యం, ప్రారంభించిన చోట కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటల కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ భారీ కుట్రకు తెరలేపినట్టు తెలుస్తున్నది.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, ఒకవేళ ఏర్పాటు చేసినా అక్కడ ఎక్కువగా పంట దిగుబడులు కొనకుండా నయా కుట్రకు తెరలేపినట్టు తెలిసింది. కొర్రీలు పెట్టి రైతులు విసిగిపోయేలా చేయాలనే వికృత ఆలోచన చేసినట్టుగా తెలిసింది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ పంటలను రైతులు ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకొనేలా రెచ్చగొట్టే విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలిసింది. పంట దిగుబడులను అధికంగా కొనుగోలు చేస్తే సర్కార్‌పై ఆర్థికభారం అధికంగా పడుతుందనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది.
ఈ సీజన్లో వరి పండించిన రైతులకూ తిప్పలు తప్పడం లేదు. వరి కోతలు మొదలైనా సివిల్ సప్లయ్ ఆ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనే లేదు. కేవలం పదుల సంఖ్యలోనే కేంద్రాలను ప్రారంభించింది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి రైతులు పడుతున్న ఇబ్బందులు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు, సివిల్ సైప్లె తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.