హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ బిడ్డలకు జరిగిన నష్టాన్ని సవరించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 29.56 కోట్ల మందికి ముద్ర రుణాలు అందగా, తెలంగాణలో మాత్రం 47.27 లక్షల మందికే ఇచ్చారని వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన జాతీయ సగటుతో సరిచేయడానికి రాష్ట్రంలో మరో 35.80 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని, ఈ విషయంపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందనలేదని వివరించారు. ఇప్పటికే రాష్ర్టానికి ఐటీఐఆర్, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ధాన్యం కొనుగోలు, ఐఐఐటీ, ఐఐఎం, నవోదయ స్కూల్స్, వైద్య కళాశాలల మంజూరులో తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్‌షా ముద్ర రుణాల పంపిణీపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.