హైదరాబాద్ : కొత్త ఏడాది వేడుకల దృష్ట్యా డ్రగ్స్, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ నిఘా పెట్టింది. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే 14 బృందాలతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అధికారులు దృష్టి సారించారు. జిల్లా, స్టేట్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సిబ్బందితో నిఘా ఉంచారు.
డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి. ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉండనున్నాయి.
న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. న్యూఇయర్ వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని నిబంధన విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని ఆదేశించింది. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని సూచించింది.