Liquor Shop License | కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్‌శాఖ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సులు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్నాయి. కొత్తగా జారీ చేయనున్న లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. పాత విధానం ద్వారా ఈసారి మద్యం దుకాణాల లైసెన్సులను జారీ చేయనున్నది.
దరఖాస్తు ఫీజు, లైసెన్సుల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సారి కూడా కొత్త లెసైన్సులకు దరఖాస్తు ఫీజును రూ.2లక్షలుగా నిర్ణయించింది. మద్యం లైసెన్సుల జారీకి జిల్లాల వారీగా గురువారం నుంచి ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఈ నెల 4 నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు ఈ నెల 21న డ్రా పద్ధతిలో లైసెన్సులను కేటాయించనున్నారు.
మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడకులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించింది. అలాగే ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో 5శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. గతేడాది ప్రభుత్వం ఆయా కులస్తులకు రిజర్వేషన్లు అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కొత్త లెసెన్సుల జారీలోనూ రిజర్వేషన్లు కేటాయించింది. గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనున్నారు. మిగతా 1864 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలను ఏర్పాటు చేసి లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించనున్నారు.