Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే కార్పొరేష న్ చైర్మన్ పదవులు, సలహాదారుల నియామకాల్లో రాష్ర్టేతరులకు పెద్దపీట వేసిన రేవంత్ ప్రభుత్వం, ఇప్పుడు మరో రాష్ర్టేతరుడిని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయశాఖ ధార్మిక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని చూస్తుంటే ‘రాష్ట్రంలో ఉన్న ధార్మికవేత్తలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు ఉన్నదా?’ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన జీ గోవిందహరిని ధార్మిక సలహాదారుగాని యమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఆయనకు రాష్ట్రంలోని దేవాలయాలు, జాతరల్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండడమే కాకుండా ఆలయాల అభివృద్ధికి సూచనలిచ్చేలా, శాఖాపరమైన ముఖ్య నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించేలా అధికారాలిచ్చింది. రాష్ట్రంలో అసలు ధార్మికవేత్త లు, పండితులే లేనట్టు వేరే రాష్ర్టానికి చెంది న వ్యక్తిని ధార్మిక సలహాదారుగా ఎలా నియమిస్తారని పండితులు, ధార్మిక వేత్తల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఇక్కడెవరూ లేరా?
అసలు రాష్ట్రంలో ఈ పదవికి అర్హతలున్నవారెవరూ లేరా? అని తెలంగాణ పండితులు, ధార్మిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. యాదగిరిగుట్ట వేదపాఠశాల సలహాదారుగా కూడా గోవిందహరే వ్యవహరిస్తున్నారు. అంటే రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో జరిగే ముఖ్య కార్యక్రమాలన్నిటినీ ఈయనే పర్యవేక్షిస్తున్నారని తెలంగాణ పండితులు చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో ఇంతమంది ధార్మికవేత్తలు ఉండగా పక్కరాష్ట్రం వారిని అందలమెక్కించడమేమిటని, తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. తమ వారిని అందలమెక్కించడమే పనిగా సదరు వ్యక్తుల అర్హతలను చూడకుండా, వారి గత చరిత్రను పరిశీలించకుండా ఎవరిని పడితే వారిని ముఖ్యమైన పదవుల్లో నియమించడమేమిటని తెలంగాణ ధార్మిక లోకం ప్రశ్నిస్తున్నది.
గోవిందహరిపై విమర్శల వెల్లువ
తెలంగాణ దేవాదాయశాఖ ధార్మిక సలహాదారుగా నియమితులైన గోవింద హరి వాస్తవానికి తమిళ అయ్యర్అని తెలంగాణ ధార్మికవేత్తలు చెప్తున్నారు. ఈయన హైదరాబాద్లోని వెస్ట్మారేడ్పల్లిలో నివాసముంటున్న తమిళియన్ అని, పలు ధార్మిక పీఠాలకు సంబంధించి వివాదాస్పద వ్యక్తిగా నిలిచారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గోవిందహరి నియామకం, ఆయన గత చరిత్రపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. గోవిందహరి గతంలో కంచి పీఠం, కోయంబత్తూరు స్వామివారు, పుష్పగిరి పీఠం.. ఇలా పలు ధార్మిక పీఠాలు, మఠాల వద్ద చేరి వారితో కలిసి ఉంటూనే సమస్యలకు కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.
‘సనాతన ధర్మానికి వేదికైన తెలంగాణలో ఎంతో మంది ధార్మికవేత్తలు, పండితులు ఉండగా అసలు శాస్ర్తాలే తెలియని గోవిందహరి లాంటి వ్యక్తిని ధార్మిక సలహాదారుగా ఎలా నియమిస్తారు? ఆయనకు ఏదైనా శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నదా ముందు తెలుసుకోండి’ అంటూ ధార్మికవేత్తలు సూచించారు. ‘తెలంగాణలో పండితులే లేనట్టుగా తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ధార్మిక సలహాదారుగా నియమించడమనేది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో సంస్కృతులకు మూలమైన తెలంగాణలో ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన వ్యక్తులు.. అదికూడా శాస్త్రం తెలిసిన పండితులు, ధార్మిక వేత్తలకు అవకాశం కల్పిస్తే బాగుండేది’ అని ధార్మికవేత్తలు అభిప్రాయపడ్డారు.