హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా అందించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఆదిలోనే అభాసుపాలవుతున్నది. రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానం కారణంగా ఈహెచ్ఎస్ స్కీమ్ కింద సేవలందించేందుకు నెట్వర్క్ దవాఖానలు వెనుకాడుతున్నాయి. ప్రస్తుతం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్(ఈహెచ్సీటీ) కింద చెల్లించే ప్యాకేజీల రేట్లతో వైద్యసేవలు అందించడం కష్టతరమని సంబంధిత యాజమాన్యాలు వాపోతున్నాయి.
కొత్త ఈహెచ్ఎస్ విధానంలో ప్రతిపాదిత ప్యాకేజీలు ప్రస్తుత ఆరోగ్యశ్రీ, గత ఈహెచ్ఎస్ ప్యాకేజీల ధరల కంటే తక్కువగా ఉన్నాయని నెట్వర్క్ దవాఖానలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉదాహరణకు ఓ పేషెంట్ ఈహెచ్ఎస్ కింద కాలు సర్జరీ చేయించుకునేందుకు నెట్వర్క్ దవాఖానకు వస్తే.. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 26,552గా ధర నిర్ణయించింది. అయితే ఆరోగ్య శ్రీ కింద ఇదే సర్జరీకి రూ.40వేలు చెల్లిస్తున్నారు.
ఇక పాత ఈహెచ్ఎస్ ధరల ప్రకారం ఇదే సర్జరీకి రూ.32,000 చెల్లించేవారు. ఈ సర్జరీకి రూ.44,500 వరకు ఖర్చు అవుతున్నట్టు నెట్వర్క్ దవాఖానలు చెబుతున్నాయి. మరోవైపు సర్జరీలకు ఆసుపత్రి సర్వీస్, ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్, ఆక్సిజన్, పరికరాల చార్జీల విషయమేందని నిలదీస్తున్నాయి. ఈ అంశంపై సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నాయి.
ఈహెచ్ఎస్ ప్యాకేజీ ధరలను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా క్షేత్ర స్థాయి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో పున: సమీక్షించాలని నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. 2011లో నిర్ణయించిన ధరల కన్నా తక్కువకు 2026లో చికిత్సలు చేయమనడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే కమిటీల్లో కనీసం 10 నెట్వర్క్ దవాఖానల ప్రతినిధులకు చోటు కల్పించాలని డిమాండ్ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. దీంతో పాటు గత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 153 నెట్వర్క్ దవాఖానల్లో సేవలు ప్రారంభమైనట్టు ప్రభుత్వం చెబుతున్నా, తమను సంప్రదించకుండానే దవాఖానల జాబితా ఎలా పెడుతారని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. సీజీహెచ్ఎస్ కింద ట్రస్ట్ దవాఖానలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చికిత్స అందిస్తుండగా, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నగరంలో కొన్ని దవాఖానలు మాత్రమే ఈహెచ్ఎస్ కింద సేవలందిస్తున్నట్టు తెలిసింది.
మిగతా చోట్ల సేవలు అందడం లేదని సమాచారం. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం మే, జూన్ జీతాల్లో నుంచి 1.5శాతం చొప్పున ప్రీమియం కింద కట్ చేసుకొని రూ.100 కోట్లు తమ ఖాతాలో వేసుకోగా, ఈహెచ్ఎస్ సేవల్లో జాప్యంపై పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మండిపడుతున్నారు. ప్రీమియం కట్ చేసుకున్నాక ఉద్యోగుల ఆరోగ్యం అంశంలో ఈ ఆటలెంటని ప్రశ్నిస్తున్నారు.
తమ సమస్యల పరిష్కారం విషయంలో స్పష్టత ఇవ్వకుండా సేవలు అందించాలనడం కరెక్ట్ కాదని నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, సీఎంవో, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు రాసినా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నాయి.
నెట్వర్క్ దవాఖానల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు యత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రమంతటా ఈహెచ్ఎస్ స్కీమ్ అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతుండగా, నెట్వర్క్ దవాఖానలు మాత్రం సేవలందించేందుకు ససేమిరా అంటున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.