విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం ఆలోచనల వద్దే ఆగిపోవద్దు. వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లతో నమ్మకాన్ని నిలబెట్టండి. రేపటి అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని పెంపొందించుకోండి.
హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, ఎకో సిస్టం ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ స్టార్టప్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని.. గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉద్ఘాటించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు, పరిపాలనా సంస్కరణలు, నూత న ఆవిష్కరణల్లో దేశానికే దిక్సూచిగా నిలిచిందని అభివర్ణించారు. అమెరికా న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక ‘కొలంబియా బిజినెస్ స్కూ ల్’లో ఆదివారం జరిగిన 21వ వార్షిక ఇండి యా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు కేటీఆర్ ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇ న్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల్లో ని విద్యార్థులు, వివిధ రంగాల్లోని నిపుణులు భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడమే కాదు.. భవిష్యత్తరాలకు తగిన సామర్థ్యాలు, శక్తియుక్తులను పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. పదేండ్ల ప్ర స్థానంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. అవకాశాల కోసం ఏనాడూ ఎదురుచూడలేదని, అందిపుచ్చుకొనేందుకు అద్భుతమైన పాలసీలు రూ పొందించామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించి, తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధి సాధించామని స్పష్టంచేశారు. 2027లో భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో దశాబ్దకాలంలో సాధించిన ఆర్థిక ప్రగతి దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు.
రాష్ర్టాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగా ల్లో పురోగమిస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘రాష్ర్టాలు, దేశాలను నడిపే నాయకత్వానికి స్ప ష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుంది. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. భవిష్యత్ గురించి మాటలు చెప్పడం కాదు.. దానిని మనమే సృష్టించడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ రాష్ర్టాలే దేశానికి గ్రోత్ ఇంజిన్లు అనే ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలని సూచించారు. దేశాభివృద్ధి ఒకే ర కమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘భారతదేశం 28 ఇంజిన్లు కలిగిన ఒక ఫార్ములా వన్ రేసింగ్ లాంటిది.. ప్రతి రా ష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి’ అని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు రాష్ర్టాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని గుర్తుచేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామికరంగం లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్ తెలిపారు. దేశంలో అనేక రాష్ర్టాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణ ఐటీ రంగం సాధించిన విజయాలను గణాంకాలతో వివరించారు. ‘2014లో రూ.57వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2023 నాటికి రూ.2.72 లక్షల కోట్లకు పెరిగాయి. ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుంచి 10లక్షలకు చేరుకున్నాయి. ప్రభుత్వ చిత్తశుద్ధి, దూరదృష్టితో చేపట్టిన చర్యలు, వేగవంతమైన నిర్ణయాలు, పకడ్బందీ ఎకో సిస్టమ్ కారణంగానే ఈ అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. ప్రతిష్ఠాత్మక అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని వివరించారు. గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ లాంటి దిగ్గజ సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించడం ద్వారా తెలంగాణ సాగునీటిరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తద్వారా పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. పదేండ్లలో అనేక బృహత్తర నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి సాగు ముఖచిత్రాన్ని మార్చివేశామని చెప్పారు.
దేశానికి రాష్ర్టాలే గ్రోత్ ఇంజిన్లు. ఈ ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలి. ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. భారతదేశం 28 ఇంజిన్లు కలిగిన ఒక ఫార్ములా వన్ రేసింగ్ లాంటిది. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి
– కేటీఆర్
నూతన స్టార్టప్‌లకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేటీఆర్ చెప్పారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ లాంటి సంస్థల ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ైస్కె రూట్ ఏరో స్పేస్, డార్విన్ బాక్స్, జెనోటి, హై రేడియస్ లాంటి యునికార్న్ సంస్థలు హైదరాబాద్‌లో ఆవిర్భ వించడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో అద్భుతాలు సృష్టించిందని చెప్పారు. ఏకంగా ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడోవంతు ఇక్కడే ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తున్నదని వెల్లడించారు. దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40శాతం వాటా కలిగిఉన్నదని వివరించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్‌సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రిటెక్ లాంటి రంగాల సమ్మేళనంతోనే భవిష్యత్ అభివృద్ధి సాధ్యమని కేటీఆర్ వివరించారు. ప్రస్తుత పాలకులు ఈ రంగాలపై దృష్టిసారించాలని సూచించారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం ఆలోచనల వద్దే ఆగిపోవద్దని, వాటి సాధనకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించాలని హితబోధ చేశారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లతో నమ్మకాన్ని నిలబెట్టండి.. రేపటి అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని పెంపొందించుకోండి’ అంటూ పిలుపునిచ్చారు.