హనుమకొండ, అక్టోబర్ 17 : ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాల్సిందేనని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్(టీజీవీఏసీ) జాక్ పిలుపు మేరకు గురువారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ భవన్ ఎదుట భారీ ర్యాలీ నిర్వహించి మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి 16 సర్కిళ్ల నుంచి పెద్ద సంఖ్యలో విద్యుత్తు కార్మికులు తరలివచ్చారు. ఆర్టిజన్స్ వద్దు.. కన్వర్షన్ ముద్దు, ఆర్టిజన్స్ కార్మికుల ఐక్యత వర్థిల్లాలి, జేఏసీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 23,667 మంది కార్మికులను కన్వర్షన్ చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కన్వర్షన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత ప్రకారం జేఎల్ఎస్, సబ్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం సీఎండీ వరుణ్‌రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎంఏ వజీర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, కో కన్వీనర్ జీ నాగరాజు, కో చైర్మన్ బీ శంకర్, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ సదానందం, జాయింట్ సెక్రటరీ చంద్రారెడ్డి, అరవింద్‌తోపాటు వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 26న మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు టీఈఈ- 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు తెలిపారు. గురువారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీకి సమ్మె నోటీసు అందిచినట్టు చెప్పారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని యూనియన్ ప్రెసిడెంట్ వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, అడిషనల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి కోరారు.