హైదరాబాద్ : ప్రయివేటు రంగంలో ఉపాధి కల్పన శరవేగంగా జరుగుతోంది. ఇటీవల తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, తద్వారా రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీంతో ఈ రంగంలో 29 వేల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టబడులను ఆకర్షించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టంతో 17,921 పరిశ్రమలు నూతనంగా వచ్చాయి. 13,631 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. రూ. 1.07 లక్షల కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ పరిశ్రమల్లో 8.17 లక్షల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. మరో 4,982 పరిశ్రమలు ప్రారంభానికి సిద్దమవుతున్నాయని తెలిపారు.
ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా దూసుకుపోతోందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 1500కు పైగా పెద్ద, చిన్న ఐటీ పరిశ్రమలు ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొని ఉన్నాయని చెప్పారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు అయినా మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐబీఎం, కాగ్నిజెంట్, అమెజాన్, ఒరాకిల్‌తో పాటు తదితర సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ పరిశ్రమ ద్వారా 3.23 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ అభివృద్ది కోసం తీసుకున్న చర్యల ఫలితంగా 6.29 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. పరోక్ష ఉపాధి అవకాశాలూ పెరిగాయన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 12.98 శాతం పెరుగుదల నమోదైంది. 2021లో తెలంగాణ ఐటీ రంగం ఎగుమతుల మొత్తం విలువ లక్షా 45 వేల 522 కోట్లు అని తెలిపారు.