Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నోటిఫికేషన్ని నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియలన్నింటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గురువారం ఉదయమే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నామినేషన్లు సైతం దాఖలు చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం విధితమే. అంశంపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో9తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. రెండురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ కోడ్ అమలుతో పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.