హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): వీసీల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్‌కు అప్పగించడం, వర్సిటీ బోధనా సిబ్బంది నియామకంపై యూజీసీ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ‘యూజీసీ రెగ్యులేషన్-రాష్ట్ర యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లో సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యూజీసీ గైడ్‌లైన్స్‌తో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. విద్యా కమిషన్ చైర్మన్ మురళి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, రమా మెల్కొటే, నరసింహారెడ్డి, కోదండరాం, తిరుపతిరావు, మురళీమనోహర్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, పద్మజాషా పాల్గొన్నారు.