హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వేసవి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి పెట్టడం సహజం. రాష్ట్ర ప్రజలు ఎండలు, అకాల వర్షాలతో సతమతమవుతుంటే, మంత్రులు మాత్రం అవేమీ పట్టనట్టుగా కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధాన శాఖలకు చెందిన సగం మంది మంత్రులు కేరళలోనే తిష్ట వేశారు. అకాల వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సిన రెవెన్యూ శాఖ మంత్రి కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు.
పారిశుద్ధ్య లోపంతో హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలతోపాటు పట్టణాల్లో డ్రైనిజీలు పొంగిపోర్లుతున్నాయి. తాగునీటి సమస్య తీవ్రమవుతున్నది. వీటి పరిష్కారానికి సమ్మర్ ప్లాన్ సిద్ధం చేసి, అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే, అదేమీ పట్టనట్టుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు.
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వేళ మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇచ్చే కార్యక్రమాల పర్యవేక్షణ వదిలేసిన సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కేరళ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బుధవారం కేరళకు వెళ్లారు. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోయి రైతుల అల్లాడుతుంటే.. వాటిని పట్టించుకోకుండా ఈ నెల 4 వరకు అక్కడే ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. పశువులకు గ్రాసం, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన మత్స్య, పాడిపరిశ్రమల శాఖల మంత్రి వాకిటి సైతం ప్రచారంలో ఉన్నారు.