హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జిల్లా అకడమిక్ టాస్క్‌ఫోర్స్ (డీఏటీఎఫ్)ల ఏర్పాటును విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలన కారణాల రీత్యా వీటి ఏర్పాటును ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు ప్రకటించారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని రాష్ట్రంలో ‘తొలిమెట్టు’ పేరుతో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకాగా బోధన, అభ్యసన పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు టీచర్లు, అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విద్యార్థులవారీగా కనీన సామర్థ్యాలను నిర్దేశించి వాటిని విద్యార్థులంతా సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు జిల్లాకొక అకడమిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తూ నవంబర్ 19న ఉత్తర్వులులిచ్చారు. డీఈవోతోపాటు టీచర్లు, రిసోర్స్‌పర్సన్స్, ఎన్జీవోల సభ్యులకు టాస్క్‌ఫోర్స్‌లో భాగస్వామ్యం కల్పించారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్జీవోలకు భాగస్వామ్యం కల్పించి టాస్క్‌ఫోర్స్ అని పేరు పెట్టడాన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఉత్తర్వులను నిలిపివేసింది.
ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, మారెడ్డి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి సహా ఇతర సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు.