హైదరాబాద్ : తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు విధించామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ ఆంక్షలు జనవరి 2వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు. ప్రజలందరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. జిల్లా పోలీసులు అధికారులు, కమిషనర్లకు తగిన సూచనలు ఇచ్చాం. ప్రభుత్వ ఆంక్షలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ర్యాలీలు, బహిరంగ సభలు జరగకుండా చూడాలి. అందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలి అని పోలీసులకు సూచించారు.
కొవిడ్ నియంత్రణలో భాగంగా ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలను విధిగా పాటించాలి. అంతర్జాతీయ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తుందని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వారికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. పబ్లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.