హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం జెట్ వేగంతో దూసుకుపోతున్నది. పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి రికార్డులు సృష్టిస్తున్నది. రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. కరోనా విపత్తు సమయంలోనూ జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఒకవైపు కరోనా కాటేస్తున్నా, కేంద్రం ఏకాణా కూడా ఇవ్వకున్నా వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో దేశ జీడీపీ -1.4 శాతానికి పడిపోగా, తెలంగాణ మాత్రం 1.2 వృద్ధిరేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణలో ప్రగతి అత్యద్భుతమని రాష్ట్ర గణాంక శాఖ విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ నివేదికను పరిశీలిస్తే అర్థమవుతున్నది. జీఎస్డీపీలోనూ, తలసరి ఆదాయంలోనూ జాతీయ సగటును మించి వృద్ధిరేటు నమోదు చేసింది. 2012-13వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.4,01,594 కోట్లు ఉంటే, 2021-22 నాటికి మూడురెట్లు పెరిగి రూ.11,48,115 కోట్లకు ఎగబాకింది. దేశ జీడీపీలో తెలంగాణ 4.9 శాతం అందిస్తున్నది.
తలసరి ఆదాయం వృద్ధిలోనూ టాప్
తలసరి ఆదాయం వృద్ధి రేటులోనూ తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచింది. గత ఐదేండ్లలో అతివేగంగా తలసరి ఆదాయంలో వృద్ధిని నమోదు చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2020-21లో మధ్యప్రదేశ్ 11.21 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. సిక్కిం 11.19 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ 10.57 శాతం వృద్ధిరేటుతో మూడోస్థానంలో ఉన్నాయి. పెద్ద రాష్ర్టాల జాబితాను పరిశీలిస్తే మధ్యప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉన్నది. అరుణాచల్‌ప్రదేశ్ 10.54 శాతం, ఆంధ్రప్రదేశ్ 10.40 శాతం, కర్ణాటక 9.84 శాతం, పశ్చిమ బెంగాల్ 9.82 శాతం, మణిపూర్ 9.80 శాతం, ఒడిశా 9.62 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ 8.96 శాతం వృద్ధితో పదో స్థానానికి పరిమితమైంది. ఉత్తరప్రదేశ్ 5.73 శాతం వృద్ధితో 22వ స్థానంలో అట్టడుగున ఉన్నది. బీహార్ 7.58 శాతం, రాజస్థాన్ 6.86 శాతం, మహారాష్ట్ర 5.72 శాతానికే పరిమితం అయ్యాయి.
జీఎస్డీపీ ట్రిపుల్
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ – జీఎస్డీపీ) పదేండ్లలో మూడింతలు పెరిగింది. 2012-13వ ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ రూ.4,01,594 కోట్లు ఉంటే, 2021-22లో రూ.11,48,115 కోట్లకు ఎగబాకింది.
జాతీయ సగటును మించి వృద్ధిరేటు
2014-15లో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 2021-22 నాటికి రూ.11.48 లక్షల కోట్లకు ఎగబాకింది. 2012-13లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతంగా ఉండగా, 2021-22 నాటికి 4.9 శాతానికి పెరిగింది.
175 శాతం వృద్ధి
2012-13 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం సుమారు రూ. లక్ష ఉండగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.75 లక్షలకు చేరింది. దశాబ్దకాలంలో 175 శాతం వృద్ధిరేటు సాధించింది. 2021-22లో తెలంగాణ జీఎస్డీపీ సగటు వృద్ధిరేటు 12.4 శాతం నమోదు కాగా, జాతీయ వృద్ధిరేటు 10.6 శాతానికే పరిమితం అయ్యింది.
ఐదేండ్లలో అనూహ్య వృద్ధి
గత ఐదేండ్లలో తెలంగాణ జీఎస్డీపీ అనూ హ్య వృద్ధి సాధించింది. దేశంలో అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటును నమోదు చేస్తున్న రాష్ర్టాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల జాబితాలో మధ్యప్రదేశ్ జీఎస్డీపీలో 12.65 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 10.84 శాతం వృద్ధిరేటుతో మూడో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌ను మినహాయిస్తే బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ తెలంగాణ కంటే వెనుకబడే ఉన్నాయి. దేశానికి రోల్ మాడల్ అని బీజేపీ నేతలు పదేపదే వల్లె వేస్తున్న గుజరాత్ రాష్ట్రం తెలంగాణ కంటే మూడు రాష్ర్టాల తర్వాత ఉన్నది. 9.83 వృద్ధిరేటుతో పదో స్థానానికి పరిమితమైంది. ఉత్తరప్రదేశ్ గత ఐదేండ్లలో 7.86 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదు చేసింది. జీఎస్డీపీ వృద్ధి రేటును మూడు క్యాటగిరీలుగా విభజించగా, తెలంగాణ మొదటి క్యాటగిరీలో ఉన్నది.