హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): అభయహస్తం దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనబడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. జారి పడితే తీసి మళ్లీ తీసుకుంటారు? ఏముంది ఆడ? అని చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులను ర్యాపిడో బైక్పై తరలిస్తుండగా హైదరాబాద్ బాలానగర్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొని రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దానిని చిన్న అంశంగా చూపేందుకు ప్రయత్నించారు.
తొలుత అసలు అలాంటి ఘటనే జరగలేదన్నట్టుగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీకి చెందిన నోడల్ అధికారిని సస్పెండ్ చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. తప్పు జరిగితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. దీంతో తప్పు జరిగిందని పరోక్షంగా అంగీకరించినట్టయ్యింది. ‘సైబర్ నేరగాళ్లు అభయహస్తం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని, పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? అలా ఇస్తా అంటే మంచిదే కదా’ అంటూ మరో ప్రశ్నకు వెటకా రం చేశారు. దరఖాస్తుదారుల డాటా దుర్వినియోగం అవుతున్నదంటూ ప్రజలు వ్యక్తంచేస్తున్న ఆందోళనను కూడా పట్టించుకోకుండా సమాధానాలు ఇవ్వడం గమనార్హం.