Telangana Drought | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నది. వానలు సరిపడా లేవు, సాగునీళ్లు కరువయ్యాయి. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. రైతుల ఆరుగాలం కష్టం కండ్లముందే ఆవిరవుతున్నది. కరువుతో అన్నదాతలు ఇంతలా అరిగోస పడుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరువు సాయం ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. కరువు మండలాల ప్రకటనపైనా మీనమేషాలు లెక్కిస్తున్నది. కనీసం కేంద్రప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. కరువు మండలాలను ప్రకటించి, కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే నివేదికలు పంపి, ఆదుకోవాలని విజ్ఞ ప్తి చేశాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం మొ ద్దునిద్ర వీడటం లేదు.
రాష్ట్రంలో కరువుపై ఇప్పటికే స్పష్టత ఏర్పడింది. అడుగంటిన భూగర్భజలాలు, ఎండిపోతున్న పంటలు, కరెంట్ కోతలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నా యి. అయినా అధికారికంగా కరువును ప్రకటించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. నేటికీ కరువు మండలాలను గుర్తించే పనిలోనే ఉన్నది. కరువుపై నివేదికను సైతం ఇప్పటి వరకు రూపొందించలేదు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఇప్పటికే కరువును ప్రకటించడంతోపాటు ఏయే మండలాల్లో కరువు ఏర్పడిందో ప్రకటించాలి. కరువు మండలాల జాబితాను విడుదల చేయాలి.
కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఆ పని చేయనేలేదు. ఉపన్యాసాలు, పత్రికా ప్రకటనలే తప్ప.. అధికారికం గా ప్రకటించిందీలేదు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కరువుపై చ ర్చించారు. 17శాతం లోటు వర్షపాతం నమోదైందని, 235 మండలాల్లో కరువు నెలకొన్నదని వెల్లడించారు. దీనిపై అతి త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చిస్తుందని, మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి నివేదిస్తుందని వెల్లడించారు. కానీ క్యాబినెట్ సమావేశం ముగిసి నేటికి తొమ్మిది రోజులు.. ఇప్పటివరకు అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎస్ సంజయ్ ఝాజు మరోసారి కరువు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. రెవెన్యూ, గ్రౌండ్‌వాటర్, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర శాఖల నుంచి సమగ్ర వివరాలు సేకరించి, నిబంధనల ప్రకారం కరువు ప్రభావిత మండలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 12 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర కరువు నివేదికను రూపొందించాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరులోపు నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అంటే ఈ లెక్కన ఈ నెలాఖరు వరకు కూడా కరువు మండలాలను ప్రకటించే అవకాశమే లేదు.
కరువు పరిస్థితులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికను రూపొందించి, కరువు మండలాలను ప్రకటించి, కేంద్రానికి జాబితాలను అందజేశాయి. 18.8 శాతం లోటు వర్షపాతం నమోదైందని, తద్వారా 265 మండలాల్లో కరువు ఏర్పడిందని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయి నివేదిక అందించారు. జాతీయ విపత్తుల నిధి నుంచి రూ.17,500 కోట్ల పరిహారం ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బృందం రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించి కరువు పరిస్థితులను నమోదు చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 10న కేంద్రానికి కరువు నివేదిక సమర్పించింది. ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. కరువు నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.3,705 కోట్లు ఇవ్వాలని కోరారు. ఇలా పొరుగు రాష్ర్టాల ప్రభుత్వాలు అక్కడి రైతుల గోస తీర్చేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటివరకు కరువుపై కేంద్రానికి కనీసం లేఖ రాసిన పాపాన పోలేదు. కేంద్రంతో కనీసం మాట్లాడనూ లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం కరువును దాచేందుకు కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఒకవేళ కరువు ఎక్కువగా ఉన్నట్టు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కరువుపై ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంటుంది. రైతుల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి నుంచి తప్పించుకునేందుకే కరువు ప్రకటనపై, కరువు మండలాల ప్రకటనపై జాప్యం చేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటల సాగుపై కాకి లెక్కలు చెప్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవైపు వర్షాలు లేకపోయినా, పంటలు ఎండిపోతున్నా నిరుటికి సమానంగా పంటలు సాగైనట్టు, ఆ మేరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ చెప్తున్నది.
నిరుడు వానకాలంలో 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని ఆ శాఖ నివేదిక ఇచ్చింది. కరువు పరిస్థితులు నెలకొన్నా, నిరుటితో పోల్చితే కేవలం 7 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటల సాగు తగ్గినట్టుగా పేర్కొన్నది. తద్వారా రాష్ట్రంలో ఎలాంటి కరువు పరిస్థితులు లేవనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటల సాగు బాగుంటే ఇక కరువు ఎక్కడున్నదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేంద్రం కూడా ఇదే కారణంతో కరువు సాయం నిలిపివేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలా కరువును ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధుల కేటాయింపు నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కాకిలెక్కలతో కరువును దాచే కుట్ర చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి మరో ఉద్దేశం లేకుంటే కరువు మండలాలను ప్రకటించడంలో, కరువుపై నివేదిక అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో నెలకొన్న కరువుపై కేంద్రానికి లేఖ రాశారు. రూ.3,075 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ 11 పేజీల లేఖ రాశారు. కానీ, అదే పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ గురిం చి మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ఒక్క రాష్ట్రంపైనే ప్రత్యేకంగా అభిమానం చూపించడం, మరో రాష్ర్టాన్ని పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడి హోదాలో తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంటే తెలంగాణ వాళ్లు రైతులు కాదా? తెలంగాణ రైతులు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదా? భవిష్యత్తులో తెలంగాణ రైతుల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రైతుల కండ్లలో కన్నీళ్లు పెట్టిస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రైతుల ఉసురుపోసుకుంటున్నది. రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించకుండా రైతులపై పగపట్టింది. వర్షపు నీటిని ఎత్తిపోయకుండా వృథాగా కిందికి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను ఎత్తిపోయకపోవడంతో తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోతుంటే.. దిగువన ఉన్న ఏపీ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకున్నది. ఇది కాలంతెచ్చిన కరువు కన్నా.. కాంగ్రెస్ తెచ్చిన కరువేనని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ నీళ్లు ఎత్తిపోసి ఉంటే పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండేది కాదని చెప్తున్నారు. దీంతో ఇటు వర్షాలు లేక, అటు కరెంట్ లేక, సాగునీళ్లు కరువై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికొచ్చిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్లు, స్ప్రేయింగ్ మిషన్లు, బిందెలతో నీళ్లు చల్లుతూ పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎండిన వరి పొలాలే కనిపిస్తున్నాయి.
మొత్తంగా ఎక్కడికక్కడ కరువుతో అల్లాడిపోతున్నారు. వర్షాధారమైన పత్తి, కంది, ఇతర పప్పు చేలు సైతం ఎండకు మాడిపోతున్నాయి. పత్తి కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 5-6 క్వింటాళ్లు వస్తే గొప్ప అనే పరిస్థితి ఏర్పడింది. నష్టపోయిన రైతులకు పరిహారం అయినా ఇస్తదేమో అని అశిస్తే అది కూడా నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటివరకు కరువుకు సంబంధించి నయా పైసా పరిహారం ప్రకటించలేదు. పోనీ కేంద్రం నుంచి అయినా పరిహారం రాబట్టి రైతులకు అందిస్తుందేమో అనుకుంటే అదీ చేయడంలేదు. కావాలనే కరువును ప్రకటించడంలో జాప్యం చేస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.