సూర్యాపేట/కోదాడ, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతుడి తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, రాజేశ్‌ది సహజ మరణమేనని పోలీస్ అధికారులు తేల్చి చెప్తున్నారు. రాజేశ్‌ది లాకప్‌డెత్ అని వివిధ పార్టీలు, ప్రజా, దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాజేశ్ మృతికి కారకులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా కోదాడ పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింంది.
చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై హుజూర్నగర్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేశ్ మృతి చెందాడు. నవంబర్ 4న రాజేశ్‌ను పోలీసులు తీసుకువెళ్లారని, కేసు నమోదు చేసి 10న కోర్టులో రిమాండ్ చేశారని, 6 రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం వల్లే అనారోగ్యంపాలై మృతి చెందాడని మృతుడి తల్లి రోదిస్తూ చెప్పింది. సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో నవంబర్ 8న రాజేశ్‌పై కేసు నమోదు కాగా 10న అదుపులోకి తీసుకున్నామని అదేరోజు కోర్టుకు రిమాండ్ చేసి హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించినట్టు పోలీసులు చెప్తున్నారు. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే 2021లో చిలుకూరు గ్రామానికి చెందిన కొడారు రాజేశ్ అనే వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ప్రభుత్వం నుంచి అతనికి రూ.ఒక లక్ష మంజూరు కాగా, కొంతమంది అక్రమార్కులు ఆ చెక్కును కాజేసి మృతుడు కర్ల రాజేశ్‌కు రూ.3 వేల కమీషన్ ఇచ్చి అతని ఖాతాలో చెక్కు జమ చేసి డబ్బులు డ్రాచేశారు. దీనిపై అసలు వ్యక్తి అయిన కొడారు రాజేశ్ చిలుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం మొత్తం బయటకు వచ్చింది.
ఎవరి వాదనలు వారివే
కర్ల రాజేశ్ మృతికి కుటుంబసభ్యులు పోలీసులపై ఆరోపణలు చేస్తుండగా, పోలీసులు మాత్రం అది సహజ మరణమేనని చెప్తున్నారు. పోలీసులు చెప్తున్న ప్రకారం నవంబర్ 8న ఎఫ్ఐఆర్ కాగా, రాజేశ్‌ను 10న అదుపులోకి తీసుకొని అదే రోజు కోర్టులో రిమాండ్ చేశారు. ఈ నెల 15న ఉదయం అనారోగ్యం పాలైన రాజేశ్‌ను హుజూర్నగర్ దవాఖానకు తరలించగా, చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. మళ్లీ సాయంత్రం శ్వాస ఇబ్బందిగా ఉండటంతో తిరిగి దవాఖానకు తరలించగా, అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో హుజూర్నగర్ దవాఖానలో చికిత్స పొందుతుండగా, అనారోగ్యం తీవ్రంకావడంతో సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానకు తరలించినా, నయంకాకపోవడంతో 15న సాయంత్రం హైద్రాబాద్‌కు గాంధీ దవాఖానకు తరలించారు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 16న తెల్లవారు జామున 3.50 గంటలకు మృతి చెందాడు. అయితే నిబంధనల ప్రకారం కస్టోడియల్ రిమాండ్ ఖైదీ మృతి చెందితే ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా, ఆ రోజు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో 17న పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం మృతదేహాన్ని అప్పగించగా, ఆ రోజు రాత్రికి ఇంటికి చేరింది.
లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం
రాజేశ్ మృతదేహంతో ఆందోళన చేస్తున్న నాయకులతో ఆర్డీవో సూర్యనారాయణ చర్చించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని అందులో భాగంగా కుటుంబసభ్యులలో ఒకరికి ఇందిరమ్మ ఇల్లు, మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీని ఆందోళనకారులు తిరస్కరించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి కనీసం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, లేనట్లయితే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోడనని విశారదన్ మహరాజ్, ఇతర నేతలు ఆర్డీవోకు స్పష్టం చేశారు. ఆందోళనను విరమింపజేసేందుకు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు, చరమందరాజు, శివశంకర్‌నాయక్, ముగ్గురు ఎస్సైలు 70 మందికి పైగా పోలీసులు మోహరించారు.
సీసీ కెమెరాల ఫుటేజీ బయటపెట్టాలి
పోలీసుల చిత్రహింసలతోనే కర్ల రాజేశ్ మృతి చెందాడని ఆతని తల్లి, కుటుంబసభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌తోపాటు గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెడితే అన్నీ తేలుతాయంటున్నారు. ఈ నెల 4న అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేస్తూ 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆ తర్వాత రెండు రోజులకు కోర్టులో రిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గత మంగళ, బుధవారాల్లో కోదాడ గాంధీనగర్ ప్రధాన రహదారిపై రాజేశ్ మృతదేహంతో బైటాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. పోలీసుల చిత్రహింసలతోనే రాజేశ్ చనిపోయాడని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, దళిత సంఘాత నేతలు, వివిధ పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధ్యుడైన చిలుకూరు ఎస్సైపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కలెక్టర్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి స్వయంగా వచ్చి రాజేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోటి రూపాయల ఎక్సేగ్రేషయా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేసేందుకు హామీ ఇవ్వాలని కోరారు.