ఖైరతాబాద్, నవంబర్ 9: ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏమి చేశారో.. రాష్ర్టానికి ఎందుకొస్తున్నారో.. సమాధానం చెప్పిన తర్వాతే ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని దళిత, గిరిజన, బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. 2014 నుంచి నేటి వరకు రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, బీసీ జనసభ, తెలంగాణ మాదిగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ గొల్ల కురుమ సంక్షేమ సంఘం, తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్, గిరిజన జేఏసీ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మాట్లాడుతూ..
తెలంగాణలో ఏ ఒక్క ఫ్యాక్టరీ అయినా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. 12న ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకోవడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తారని చెప్పారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, గిరిజన, ముస్లిం, బీసీ రిజర్వేషన్లపై అనేక తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపితే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు.
ఎప్పుడో ప్రారంభమైన కర్మాగారాన్ని మళ్లీ ఇప్పుడు ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్,, గొల్లకురుమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీసీ జన గణన వేదిక చైర్మన్ గోసుల శ్రీనివాస్, గిరిజన జేఏసీ నాయకులు రాజేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.