రుణమాఫీకి పట్టాదారు పాస్పుస్తకమే ప్రామాణికం. రైతుకు భూమి ఉండి, భూమికి పాస్‌పుస్తకం ఉండి, ఆ పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఇందులో రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమే. వీళ్లందరికీ రుణమాఫీ వర్తిస్తుంది.
– ఈ నెల 16న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలివి.
రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య 60 లక్షలు ఉన్నాయి. వీళ్లందరికీ రుణమాఫీ వర్తిస్తుంది.
– 16న మీడియాతో మంత్రి తుమ్మల
రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలు ఉంటే 44 లక్షల రుణ ఖాతాలు (రుణం తీసుకున్న రైతులు) ఉన్నాయి. వీళ్లందరికీ రుణమాఫీ చేస్తాం.
– శనివారం మీడియాతో తుమ్మల మరో లెక్క.
అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా రాష్ట్రంలో సగటున 65 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది.రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ సర్కారు సిద్ధంచేసిన లెక్క బట్టబయలైంది. రుణమాఫీపై సర్కారు పైకి చెప్తున్న లెక్కలు వేరేలా ఉండగా, అసలు లెక్కలు మరోలా ఉన్నాయి.
Runa Mafi | హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): రుణమాఫీ అర్హుల సంఖ్యలో సర్కారు భారీ కోత పెట్టింది. బుధవారం రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న ఒక అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్ ప్రకారం.. ప్రభుత్వం రుణమాఫీ చేయబోయే రైతుల సంఖ్య 32.50 లక్షల మంది మాత్రమే! ఇందుకు అవసరమయ్యే నిధులు రూ.27 వేల కోట్లు మాత్రమేనని తెలిసింది. దీంతో రుణమాఫీపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది.
అధికారుల జాబితా ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీకి 32.50 లక్షల మంది అర్హులని తేల్చగా, 24.4 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తించనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా ఎలాంటి కోతలు విధించకుండా, పాస్‌పుస్తకాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే, 70 లక్షల రుణఖాతా కలిగిన రైతులకు ఎంతోకొంత రుణం మాఫీ కావాలి. కానీ, సు మారు 32.5 లక్షల నుంచి 37.5 లక్షల మంది కి కోత పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం 45% మందికి మాత్రమే రుణమాఫీ చేస్తుండగా, 55% మందికి మొండిచెయ్యి చూపిస్తున్నది.
రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని ప్రభు త్వం చెప్తున్నది. కానీ, డాక్యుమెంట్ ప్రకారం రూ.28 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేయనున్నట్టు తెలిసింది. రుణమాఫీని నాలుగు స్లాబ్‌లుగా విభజించి తొలి మూడు స్లాబ్లకు రూ.6 వేల కోట్ల చొప్పున కేటాయించి, చివరి స్లాబ్‌లో రూ.9 వేల కోట్లు కేటాయించింది. ఈ లెక్కన నాలుగు స్లాబ్లకు కలిపి ఇస్తున్నది రూ.27 వేల కోట్లే. ప్రతి స్లాబ్‌లో ఆర్జీలు, త ప్పొప్పులు, వాటి పరిష్కారానికి సంబంధించి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్న ది. కానీ, ఈ పరిస్థితి రాదనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తంచేస్తున్నారు. జాబితాలో ఉన్న రైతులకు సమస్య ఎదురైతే అప్పటికే కే టాయించిన నిధుల నుంచే ఆ సమస్య పరిష్కారమవుతుందని, అదనపు నిధులతో అవసరం లేదని చెప్తున్నారు. ఒకసారి జాబితాలో లేని రైతులకు రుణమాఫీ కావడం దాదాపు అసాధ్యమంటున్నారు. అలాంటప్పుడు అదనంగా కేటాయించిన నిధులు పేరుకే తప్ప వా టిని వాడేది లేదని చెప్తున్నారు. దీని ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం చెప్తున్నట్టుగా రూ.31 వేల కోట్లతో కాకుండా రూ.27 వేల కోట్లతోనే సరిపెట్టే అవకాశం ఉన్నది.
రుణమాఫీ అర్హుల సంఖ్యలో తేడా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. అప్పుడు 35.31 లక్షల మందికి రుణ మాఫీ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నప్పటికీ, అర్హుల సంఖ్య 32.5 లక్షలుగానే ఉండటం అనుమానాలు రేకెత్తిస్తున్నది. మంత్రి తుమ్మల చెప్పిన లెక్క ప్రకారం 44 లక్షల మంది రైతులు ఉన్నారనుకుంటే, బీఆర్ఎస్తో పోల్చితే 8.69 లక్షల మంది రైతు లు మాత్రమే అదనంగా ఉన్నారు. బీఆర్ఎస్ సర్కారు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తే 35.31 లక్షల మందికి లబ్ధి చేకూరగా, ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రు ణమాఫీ చేస్తే 32.5 లక్షల మందికే లబ్ధి చేకూరుతుండటం అనుమానాలకు తావిస్తున్నది.
ఎలాంటి కోతలు లేకుండా పాస్‌పుస్తకం అధారంగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తెరవెనుక అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నది. రేషన్‌కార్డు లేని వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ చేయడం లేదు. గురువారం రూ.లక్ష వరకు రుణం మాఫీ చేయగా రేషన్‌కార్డు లేని రైతు కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మాఫీ కాలేదు. ఈ కుటుంబాల రైతులు ఏఈవోల వద్దకు వెళ్లి ఆ రా తీయగా వాళ్ల ఆధార్ నంబర్‌తో పరిశీలిస్తే.. రేషన్‌కార్డు లేదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటూ చూపిస్తున్నది. ఈవిధంగా ప్రభుత్వం కోతలు లేవంటూనే అర్హుల సంఖ్యను కుదిస్తున్నది.
రుణమాఫీకి అర్హులయ్యే రైతుల సంఖ్య, కుటుంబాల సంఖ్యపై స్పష్టత లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం అధికారిక వివరాలను వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. దీనికితోడు రైతుల సంఖ్య, కుటుంబాల సంఖ్యపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తలోమాట మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 70 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయని చెప్తుండగా, మంత్రి తుమ్మల మాత్రం 60 లక్షల రుణ ఖాతాలున్నాయని ఒకసారి, 44 లక్షల రుణ ఖాతాలు మాత్రమే ఉన్నాయని మరోసారి చెప్పడం గమనార్హం. కుటుంబాల సంఖ్యను తొలుత 39 లక్షలని చెప్పిన మంత్రి తుమ్మల తాజాగా 25 లక్షలు మాత్రమేనని చెప్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఒక్కో లెక్క వెల్లడిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. రోజురోజుకి రుణమాఫీకి అర్హులయ్యే రైతుల సంఖ్య, కుటుంబాల సంఖ్య తగ్గుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాకు 1.21 ఎకరాల భూమి ఉన్నది. బ్యాంక్‌లో నా పేరు మీద రూ.65 వేలు పంట రుణం తీసుకున్నా. ఈ రోజు వరకు నాకు పైసలు పడలేదు. బ్యాంక్‌కు వెళ్లి అడిగితే నీ పేరు లిస్టులో లేదన్నారు. ఏఓ దగ్గరకు వెళ్లి అడిగితే ఆధార్ కార్డు నంబర్‌తో ఆన్లైన్లో చూసి మీ లోన్ మాఫీ అండర్ ప్రాసెస్ అని ఉన్నట్టు చెప్పారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలు పోయిన సర్కారు ఇప్పటికే రూ.లక్ష వరకు అందరికీ మాఫీ అయిందని చెబుతున్నది. మరి నాలోన్ ఎందుకు మాఫీ కాలేదు? కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనా?
– మామిడి సుశీలమ్మ, కోతులబాద, పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా