హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి వెంటాడుతున్నా గత ఏడాది రాష్ట్ర ఐటీ రంగం వృద్ధిలో ఎవరికీ అందనంత వేగంతో దూసుకుపోయిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు నమోదైనట్టు చెప్పారు. ఒక్క ఏడాదిలోనే కొత్తగా 1.5 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగం కల్పించిందని వివరించారు.
బుధవారం మాదాపూర్లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదిక 2021-22ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో గత 8 ఏండ్లలో ఐటీ పరిశ్రమ 140 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. 2021-22లో దేశం మొత్తంలో ఐటీరంగంలో 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తే, ఒక్క తెలంగాణలోనే లక్షన్నర మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. 2035 నాటికి రాష్ట్రం నుంచి రూ.2.9 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, అనుబంధ పరిశ్రమల ఎగుమతుల్లో గత ఏడాది మనం 26.14 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. జాతీయ ఐటీ ఎగుమతులు వృద్ధి సగటు 17.2 శాతమేనని వెల్లడించారు. జాతీయ సగటుకంటే తెలంగాణ 9 శాతం ఎక్కువ వృద్ధి నమోదుచేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.
ఐటీ రంగం దేశ సగటుతో పోల్చితే రాష్ట్రంలో రెట్టింపు వృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్ల ఉండగా, 2021-22లో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకొన్నాయని చెప్పారు. 2013-14లో ఐటీ రంగంలో 3,23,700 మంది ఉద్యోగులు ఉండగా, 2021-22 నాటికి 7,78,121 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు. 8 ఏండ్ల్లలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ రంగంలో సుమారు రూ.5.43 లక్షల మంది కొత్త ఉద్యోగులు పెరిగారని చెప్పారు. పరోక్షంగా అంతకు రెట్టింపు స్థాయిలోనే ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో నగరానికి ఒకవైపే ఉన్న ఐటీ రంగాన్ని ఇప్పుడు నలుమూలలా విస్తరింపజేయాలన్న లక్ష్యంతో గ్రిడ్ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా కేంద్రాలకు సైతం ఐటీ సేవలు విస్తరించే ఐటీ టవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు.