హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన మారణహోమంపై దేశమంతా రగిలిపోతున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ మరో వివాదంలో చికుకుంది. భారత్ సమ్మిట్ 2025లో ముద్రించిన భారత చిత్రపటం వివాదానికి దారితీసింది. భారత భౌగోళిక స్వరూప చిత్రపటంలో జమ్ముకశ్మీర్ చిత్రాన్ని సరిగా ముద్రించలేదని, నిరుడు డిసెంబర్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ సమావేశాల్లో ఏర్పాటు చేసిన చిత్రపటాన్నే భారత్ సమ్మిట్లోనూ ప్రదర్శించారని తెలంగాణ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25-26 మధ్య ‘భారత్ సమ్మిట్ 2025’ నిర్వహించారు. దాదాపు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమ్మిట్‌లో ఏర్పా టు చేసిన దేశ చిత్రపటం తప్పుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మిట్‌లో తాను పాల్గొన్న ఫొటోలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఓ ఫొటోలో రాజగోపాల్‌రెడ్డి వెనుక దూరంగా కనిపిస్తున్న భారత చిత్రపటంలో జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా ముద్రించనట్టుగా అస్పష్టంగా ఉన్నది. ఇది వివాదానికి కారణమైంది. స్పందించిన బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జరిగిన నష్టాన్ని పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రాజగోపాల్‌రెడ్డికి సమాచారం అందించి అప్రమత్తం చేసింది. దీంతో ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్టును ఆయన డిలీట్ చేశారు.
రాజగోపాల్‌రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలను స్రీన్‌షాట్ తీసిన బీజేపీ కార్యకర్తలు, నెటిజన్లు దానిని వైరల్ చేశారు. దీనిని ఆయుధంగా మార్చుకున్న బీజేపీ కాంగ్రెస్‌ను దేశద్రోహ పార్టీ అని దుమ్మెత్తి పోస్తూ పోస్టులు పెట్టారు. తెలంగాణ బీజేపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలోనూ దానిని షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాప్‌లో లడఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ఆరోపించింది. దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వివాదాల్లో చికుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత డిసెంబర్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ సమావేశాల్లోనూ ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కశ్మీర్, లేహ్ లేకుండానే భారత చిత్రపటాన్ని ముద్రించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు మరోసారి అలాంటి వివాదంతోనే తెలంగాణ కాంగ్రెస్ విమర్శలపాలైంది.