చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి.
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
- ఎంపీ చామల ప్రకటించిన మీడియా కమిటీకి బ్రేక్
- అధికారిక జాబితా కాదని కొత్త పేర్ల ప్రకటనపై ఫైర్
- ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు ఫిర్యాదు
- 24 గంటల్లోనే నిలిపివేస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు
- తనకూ అధికారముందని ఎదురుతిరిగిన ఎంపీ
- అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్న మహేశ్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యనేత వర్గీయుడిగా గుర్తింపుపొందిన భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి సోమవారం రాష్ట్రస్థాయి అధికార ప్రతినిధులు, టీవీ డిబేట్ ప్యానెలిస్టులు, మీడియా కోఆర్డినేటర్లను నియమించారు. టీవీ డిబేట్ ప్యానెలిస్టులుగా 16 మందిని, మీడియా కోఆర్డినేటర్లుగా నలుగురిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం జాతీయ చైర్మన్ పవన్ ఖేరా ఆదేశాల మేర కే ఈ నియామకాలు చేపట్టినట్టు అందులో పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వులను టీపీసీసీ 24 గంటల్లోనే నిలిపివేసింది. చామల తనకు ఒక లిస్టు చూపించి, బయటికి మరో లిస్టు ప్రకటించారని మహేశ్‌కుమార్‌గౌడ్ సీరియస్ అయినట్టు తెలిసింది. ‘ఇష్టం వచ్చినట్టు కమిటీలు ప్రకటించడానికి చామల ఎవరు?’ అంటూ ఊగిపోయినట్టు సమాచారం. అయితే చామల సైతం అంతే దీటుగా బదులిచ్చినట్టు తెలిసింది.
రాత్రికిరాత్రే ముఖ్యనేత వర్గం పేర్లు
వాస్తవానికి టీపీసీసీ మీడియా కమిటీ నియామకాలకు ముందు మహేశ్‌కుమార్‌గౌడ్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేసినట్టు తెలిసింది. పార్టీ జూన్‌లో ప్రతిపాదించిన నేషనల్ టాలెంట్ హంట్ మార్గదర్శకాల ప్రకారం నిజమైన ప్రతిభ, సంస్థాగత విధేయత ఉన్నవారికే స్థానం కల్పిస్తూ సమతుల్యమైన జాబితాను రూపొందించినట్టు సమాచారం. ఆ లిస్టులో విధేయుల కంటే వ్యతిరేకుల పేర్లే ఉన్నాయని ముఖ్యనేత అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. టీవీ డిబేట్లలో పార్టీ లైన్ మాట్లాడేవారితో ప్రయోజనం లేదని, ముఖ్యనేత వ్యక్తిగత స్వరం వినిపించేవారు కావాలని పట్టుబట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే రాత్రికిరాత్రి ముఖ్యనేత వర్గం నేతల పేర్లను ఏకపక్షంగా చొప్పించారని, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు గాంధీభవన్ వర్గాల్లో చెప్పుకొంటున్నారు.
ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేస్తుంటే పార్టీ కంటే, ముఖ్యనేత వ్యక్తిగత ప్రతిష్టను కాపాడే సొంత మనుషులే తెరపై కనిపించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తున్నది. తీరా బయటికి వచ్చిన లిస్టును చూసి మహేశ్‌కుమార్‌గౌడ్ షాక్ అయ్యారట. తాను ఆమోదించిన అధికారిక జాబితాను పకనబెట్టి, రాత్రికిరాత్రే ముఖ్యనేత అనుచరుల పేర్లను ఎలా జొప్పించారంటూ మండిపడ్డట్టు తెలిసింది. సంస్థాగత క్రమశిక్షణ కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేయడం ఏమిటని చామలను నిలదీసినట్టు సమాచారం. అయితే, చామల కూడా ఏమాత్రం తగ్గకుండా, తన వద్ద పూర్తి అధికారాలు ఉన్నాయనే ధోరణిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నిర్లక్ష్యంతో సమాధానం చెప్పినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పీసీసీ అధికారాలను సవాల్ చేస్తూ సాగిన ఈ ధికార వైఖరిపై మహేశ్‌కుమార్‌గౌడ్ మరింత సీరియస్ అయ్యారని, తక్షణమే ఏఐసీసీ మీడియా విభాగం జాతీయ అధిపతికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఢిల్లీ స్థాయిలోనూ అసహనం
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయంపై ఏఐసీసీ మీడియా విభాగం జాతీయ అధిపతి పవన్ ఖేరా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన విషయం కనీసం తన దృష్టికి తీసుకురాకుండా, తన అనుమతి లేకుండా తన పేరును ఉత్తర్వుల్లో ప్రస్తావించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా జాతీయ నాయకత్వం పర్యవేక్షణలో ఉండే అధికార ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను స్థానిక గ్రూపు రాజకీయాల కోసం వాడుకున్నారని, చామల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించారని మండిపడినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడికి లేని అధికారాలు మీడియా విభాగం చైర్మన్‌కు ఎకడి నుంచి వచ్చాయంటూ ఢిల్లీ స్థాయిలోనూ తీవ్ర అసహనం వ్యక్తమైనట్టు ప్రచారం జరుగుతున్నది. చామల ఏకపక్ష వ్యవహారశైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు అధిష్ఠానం పెద్దలకు, ఏఐసీసీ నేతలకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసేందుకు మహేశ్‌కుమార్‌గౌడ్ సిద్ధమయ్యారని, ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.
ఉత్తర్వుల రద్దు వెనుక హైడ్రామా
చామల విడుదల చేసిన ఉత్తర్వులు రద్దు చేయడానికి తెరవెనుక తీవ్రస్థాయిలో హైడ్రామా నడిచిందట. సోమవారం విడుదలైన వివాదాస్పద ఉత్తర్వులు బయటకు రాగానే గాంధీభవన్‌లోని సీనియర్ నేతలు, పాత అధికార ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. తాము ఏండ్ల తరబడి జెండాలు మోసి పనిచేస్తే, తమను కనీసం సంప్రదించకుండా ఒక సంతకంతో పకన పెట్టడంపై రగిలిపోయారని సమాచారం. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నేరుగా రంగంలోకి దిగి, గాంధీభవన్ ఐటీ, సోషల్ మీడియా విభాగం బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ప్రతినిధులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆమోదం లేని ఈ ఫేక్ ఆర్డర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే సంస్థాగత చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. మరోవైపు చామల వర్గం ఈ ఉత్తర్వులను సమర్థించుకుంటూ, ఇది ముఖ్యనేత సూచనల మేరకే జరిగిందని, వెనకి తగ్గేది లేదని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ ఆఫీస్‌కు, ముఖ్యనేత శిబిరానికి మధ్య ఫోన్లలో గంటల తరబడి వాడీవేడిగా మాటల యుద్ధం సాగినట్టు సమాచారం. చివరికి మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ తీసుకొని, ఉత్తర్వులను నిలిపివేశారట. దీంతో చామల చేసేదేమీ లేక డిఫెన్స్‌లో పడినట్టు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

