హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తీరు. తన చరిత్రను మొత్తం కులాల కుంపట్లు, మత ఘర్షణలు, అల్లర్లతో నింపేసుకొన్న ఆ పార్టీ, ఇప్పుడు మరో అడుగు ముం దుకేసి ఏకంగా బీసీ కులాలు, మైనార్టీల మధ్య తగువులు పెట్టేలా మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌పై ఇటు బీసీ వర్గాలు .. ఇటు మైనార్టీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దేశాన్ని ఆరు దశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్‌తో ఇటు కులాలు, అటు మతాల మధ్య అంతరాలు సృష్టించే ప్రణాళిక రచించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే బీసీ, మైనార్టీల కుల గణన చేయిస్తామని హామీ ఇచ్చింది.
బీసీ కుల గణన అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. దీనిపై బీఆర్ఎస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు బీసీ కుల, మైనార్టీల గణనకు లింకు పెట్టి డిక్లరేషన్‌ను ప్రకటించింది. బీసీ కులాలకు, మైనార్టీలకు రిజర్వేషన్లు, ఇతరత్రా విషయాల్లోనూ అన్యాయం జరుగుతున్నదనేది నిజం. ఇరు వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ ఈ రెంటినీ కలపడం వెనుక మాత్రం అసంబద్ధ, అనంగీకార ఆలోచనలు ఉన్నట్టుగా కనపడుతున్నదని మేధావులు పేర్కొంటున్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ జన గణన నిర్వహించాలి. అదే సమయంలో మైనార్టీలకు సమానావకాశాలు కల్పించడం కోసం కూడా ఇలాంటి కసరత్తే జరగాలి. కానీ ఈ రెంటినీ కలిపి చేయడం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టినట్టే అని ఆయా వర్గాలు అంటున్నాయి.
బీసీ కులాలకు, మైనార్టీ మతాల మధ్య లింక్ పెట్టి జరుపుతామంటున్న కుల, మత గణన ఎలా చెల్లుబాటు అవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. మ తం ఆధారంగా మైనార్టీలను బీసీ కులా ల్లో కలపడం ఎలా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్టుగా చేస్తే ఇటు బీసీల ప్రయోజనం.. అటు మైనార్టీల ప్రయోజనాలు దెబ్బకొట్టినట్టే అవుతుందని ఆయా వర్గాల ప్రముఖులు చెప్తున్నారు. దీనివల్ల ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కు తదితర మతస్థులంతా మైనార్టీలుగా రాజ్యాంగ హక్కులు అనుభవిస్తున్న మైనార్టీ క్యాటగిరీని కోల్పోతారని సామాజిక వేత్తలు అంటున్నారు. నిజానికి బీసీ కుల గణన చేపట్టి వారికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయాలున్నాయి. అది చేయకుండా.. బీసీ కులగణనతో కలిపి మైనార్టీల గణనచేయడంతో బీసీల్లో అభద్రతా భావం మొదలవుతుంది. తమకు ఇప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ మంగళం పాడేలా కొత్త ఎత్తువేసినట్టుగా ఇప్పటికే అనుమానాలు మొదలయ్యా యి. బీసీ రిజర్వేషన్ల కోటా పెంచకుండా మైనార్టీలను దాంట్లో చేర్చితే, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. పోనీ మైనార్టీలను లెక్కిద్దామంటే.. వారు కూడా హక్కులను కోల్పోతారు. ఈ సమస్యకు పరిష్కారం బీసీ కోటా పెంచడమే. కానీ ఆ అంశం సుప్రీం కోర్టులో ఉన్నది. రాజ్యాంగ సవరణ తప్ప మార్గం లేదు. ఇంత తతంగం ఉన్నప్పుడు కాంగ్రెస్ కావాలనే బీసీ కులగణనతో పాటు.. మై నార్టీలను కలుపుతామంటూ ఎలా చెప్తుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ చరిత్రలో ఇలాంటి సంఘటనలే కనపడుతాయి. వైఎస్ హయాంలో 4% మైనార్టీ రిజర్వేషన్ అని చెప్పి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఆ తర్వాత మైనార్టీ రిజర్వేషన్లను ఎత్తేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేసిన మైనార్టీ డిక్లరేషన్‌లో చెప్పినట్టుగా బీసీ కులగణనతో పాటు మైనార్టీల గణన కూడా ఇలాంటిదే అని మేధావులు అంటున్నారు. సాధ్యంకాని అంశాన్ని చెప్తూ.. ఇటు బీసీ వర్గాల ను, అటు మైనార్టీ వర్గాలను అయోమయానికి గురిచేస్తూ.. రాజకీయ పబ్బం గ డుపుకోవాలనే దుర్బుద్ధితోనే కాంగ్రెస్ డిక్లరేషన్ తెచ్చిందనే మండిపడుతున్నారు.