హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ):మావోయిస్టుల రిక్రూట్మెంట్లు జరగకుండా తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తున్నదని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల డీజీపీలు కొనియాడారు. తమ రాష్ర్టాల్లో కూడా ఈ విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని ఇతర రాష్ర్టాల డీజీపీలు నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన మంగళవారం వామపక్ష తీవ్రవాద ప్రాబల్య రాష్ర్టాల డీజీపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ డీజీపీలు రజినీశ్ సేత్, అశోక్ జునేజా, రాజేందర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ ఐజీ చారు సిన్హాతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మావోయిస్టుల కార్యకలాపాలపై సుధీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర సరిహద్దుల్లోని మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వెళ్లడం మూలంగా తెలంగాణలో వాపపక్ష తీవ్రవాదం క్రమంగా అంతరించిపోతున్నదని డీజీపీలు అంగీకరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఏజెన్సీ ఏరియాల్లో పోలీసుల కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలపై డీజీపీ అంజనీకుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రభావిత జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘కమ్యూనిటీ పోలీసింగ్’పై వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్‌కుమార్, ఆపరేషన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, గ్రేహౌండ్స్ ఏడీజీ విజయ్‌కుమార్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్, రాజీవ్మీనాతో పాటు సరిహద్దు రాష్ర్టాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.