యైటింక్లయిన్కాలనీ, డిసెంబర్ 4 : సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు సంఘం అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6న ఆర్జీ-2 జీఎం కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా యాజమాన్యంతో మాట్లాడి ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి, 80శాతం కారుణ్య ఉద్యోగం వచ్చేలా చూశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో 6 బోర్డులు నిర్వహించి 55 మం దికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపా రు. ప్రభుత్వం, యాజమాన్యం, మెడికల్ బోర్డు తీరువల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉండి అ చేతన స్థితిలో ఉన్న ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిపై బాధ్యతారహిత్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.