హైదరాబాద్, జూన్ 20 (నమస్తేతెలంగాణ): బనకచర్లపై ముందే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇప్పుడు క్యాబినెట్, చర్చలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. గోదావరి, కృష్ణాలో న్యాయమైన వాటా అడగకుండా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ ప్రతిపాదనలతో ట్రిబ్యునల్ ముందు పోరాడితే తెలంగాణ నిండా మునగడం ఖాయమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్‌కు డిమాండ్ చేయకపోవడం, చంద్రబాబుతో చర్చలు జరుపుతామనడం వెనుక ఉన్న మతలబేమిటో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. నాడు కేసీఆర్ గోదావరి జలాల్లో 968 టీఎంసీల వాటా సాధించారని, వరద జలాల్లో మరో 1950 టీఎంసీలు కలిపి మొత్తంగా 2918 టీఎంసీల కోసం పట్టుబట్టారని, కృష్ణాలోనూ 763 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ఎదుట వాదించారని, కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు చాలని చంద్రబాబుకు గురుదక్షిణ సమర్పించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.
ఆధారాలు చూపినా అదే దుష్ప్రచారమా!
గతంలో అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ బనకచర్ల గురించి ప్రస్తావించలేదని ఆధారాలతో చూపినా సీఎం రేవంత్ దుష్ప్రచారాన్ని మానుకోవడం లేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకే ఒప్పుకొన్నదని తప్పుడు లెక్కలు చెప్తున్నారని ఆక్షేపించారు. అది అప్పటి ప్రాజెక్టుల ఆధారంగా చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని స్పష్టంచేశారు. అయినా తాము కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో సగం అంటే 405 టీఎంసీలు కేటాయించాలని అడిగామని తెలిపారు. కానీ రేవంత్‌కు మాత్రం తాత్కాలిక, శాశ్వత ఒప్పందం గురించి తెలియకపోవడం శోచనీయమన్నారు.
ఫలించనున్న కేసీఆర్ పోరాటం
కేసీఆర్ కృషితో సెక్షన్-3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్‌ను సాధించారని హరీశ్ పునరుద్ఘాటించారు. ఈ సెక్షన్ ప్రకారం బ్రబేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కృష్ణా జలాల్లో తెలంగాణకు 763 టీఎంసీలు కేటాయించాలని అఫిడవిట్ వేశామని గుర్తుచేశారు. మన న్యాయవాదులు బలమైన వాదనలు వినిపిస్తున్నారని త్వరలో మన వాటా మనకు దక్కే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్
బనకచర్ల బాగోతం బట్టబయలైంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణను నిండా ముంచేందుకు సిద్ధమైన్రు.. అందుకే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయకుండా చర్చలను తెరపైకి తెచ్చిండ్రు.
–హరీశ్‌రావు