హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. సుప్రీంకోర్టు ధర్మాసనం దెబ్బకు దిగివచ్చారు. మేం రాజకీయ నాయకులను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా?. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి బాధ్యత లేకుంటే ఎలా? అంటూ గురువారం ధర్మాసనం చీవాట్లు పెట్టడంతో సీఎం నాలుక కరుచుకున్నారు. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్తూ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే.. నేరుగా తప్పు ఒప్పుకోకుండా.. ‘కొందరు వ్యక్తులు నా వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారు’ అంటూ మీడియాపై నెపం మోపారు. ‘భారత న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉన్నది. సుప్రీంకోర్టు స్వతంత్రతను నేను ప్రశ్నించాననే భావన కలిగించేలా ఈ నెల 29న మీడియాలో కామెంట్లు వచ్చాయని గుర్తించాను. న్యాయవ్యవస్థను నమ్మి, గౌరవించే వ్యక్తిగా.. మీడియాలో వచ్చిన కామెంట్ల పట్ల నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛపై నాకు అపారమైన నమ్మకం ఉన్నది. నేను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రచారం చేశారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ధర్మాసనం తలంటితేనే గుర్తుకొచ్చిందా?
సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పును ఒప్పుకోకుండా.. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పడంపై జర్నలిస్టు వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. సీఎం స్పష్టంగా అన్న మాటలను యథావిధిగా ప్రచురిస్తే వక్రీకరించారని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. సీఎం కామెంట్లు బుధవారం టీవీల్లో, వెబ్సైట్లలో, గురువారం ఉదయానికి పేపర్లలో ప్రచురితమయ్యాయి. ఒకవేళ మీడియా వక్రీకరిస్తే వెంటనే ఎందుకు ఖండనగానీ, వివరణ కానీ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్న భోజన విరామం తర్వాత ధర్మాసనం సీఎం వ్యాఖ్యలను ప్రస్తావించి, చీవాట్లు పెడితే.. శుక్రవారం ఉదయానికి జ్ఞానోదయం అయ్యిందా? అని మండిపడుతున్నారు. ధర్మాసనం తలంటితేనే మీడియా వక్రీకరించిందని రెండు రోజుల తర్వాత గుర్తుకువచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బీజేపీ-బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా కవితకు బెయిల్ వచ్చినట్టు భావిస్తే.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీకి బీజేపీ- కాంగ్రెస్ ఒప్పందం మేరకు బెయిల్ వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమి నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చిందని ఈ లెక్కన బీజేపీతో ఆప్ స్నేహం చేసినట్టా? అని నిలదీస్తున్నారు.