హైదరాబాద్, జూలై16 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సాధించినదేమీ లేదు. తెలంగాణ అంశాల్లో విజయం సాధించిందని చెప్పడమే పెద్ద అబద్ధం. సీఎం వెల్లడించిన అంశాలన్నీ గతంలో చేపట్టినవే. విభజన చట్టంలో భాగమే. మరి రేవంత్‌రెడ్డి కొత్తగా ఈ మీటింగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను ఒప్పించి సాధించింది ఒక్కటీ లేదు. ఊకదంపుడు విషయలే తప్ప మరేమీ లేదు.
1) ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం.
ఇది కొత్తదేమీ కాదు. కృష్ణానదీ జలాల వినియోగానికి సంబంధించి మొదటిదశలో ఇప్పటికే 18 ఔట్లెట్లపై టెలీమెట్రీలు ఏర్పాటు చేశారు. 1) ఎమ్మార్పీ లిఫ్ట్ 2) సాగర్ డ్యామ్ డైవర్షన్ టన్నెల్ 3) ఎన్ఎస్పీ హెడ్‌రెగ్యులేటరీ 4) ఎన్ఎస్పీ లెఫ్ట్‌కెనాల్ టన్నెల్ 5) పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎంట్రీ వద్ద 6) పాలేరు రిజర్వాయర్ దిగువన 7) ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ 101.36 కి.మీ. వద్ద 8) కల్వకుర్తి సిస్టర్న్ 9) శ్రీశైలం రిజర్వాయర్ 17/18 బ్లాక్ 10) పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ 12.265 కి.మీ. వద్ద 11) హెచ్ఎన్ఎస్ఎస్ పంప్‌హౌస్ 12) జూరాల ప్రాజెక్టు 13) జూరాల రైట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ 14) జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ 15) జూరాల లెఫ్ట్ ప్యార్లార్ కెనాల్ హెడ్‌రెగ్యులేటరీ 16) భీమా లిఫ్ట్- 1 స్కీమ్ 17) నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్ 18) కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీమ్ వద్ద వీటిని ఏర్పాటు చేశారు.
అయితే అదీ మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. వాటి గణాంకాలను ఇప్పటివరకు అధికారికంగా అమల్లోకి తీసుకోవడం లేదు. అందులోనూ పలు టెలీమెట్రీలను ఏపీ ట్యాంపరింగ్ చేసిందని కేఆర్ఎంబీతో పాటు, కేంద్రానికి సైతం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి దానిపై కేఆర్ఎంబీ గతంలోనే అధ్యయనం చేయించింది. టెలీమెట్రీల వ్యవస్థ ఏమాత్రం సవ్యంగా లేదని ఆ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. సాగర్, శ్రీశైలం వద్ద తప్ప మిగిలిన ఎక్కడా టెలీమెట్రీలు కచ్చితమైన నీటిప్రవాహ సామర్థ్యాన్ని సూచించడం లేదని స్పష్టం చేసింది.
అనువైన ప్రాంతాల్లో, అనువైన సెన్సార్లను ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీకి సిఫారసు చేసింది. రెండో దశలో 1) పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువపై 2) సాగర్ కుడి కాలువ 3) సాగర్ ఎడమ కాలువ 4) పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎడమ కాలువపై 136.35 కి.మీ. వద్ద 5) సాగర్ ఎడమ కాలువ 101.36 కి.మీ. ఏపీ సరిహద్దు వద్ద 6) పోలవరం కెనాల్ 7) ప్రకాశం బరాజ్ పశ్చిమ కాలువపై 8) ప్రకాశం బరాజ్ తూర్పు ప్రధాన కాలువపై 9) కర్నూలు కడప (కేసీ) కెనాల్‌పై టెలీమెట్రీలను ఏర్పాటు చేసే సమయంలోనే మొదటి దశలో ఏర్పాటు చేసిన టెలీమెట్రీల సెన్సార్లను అనువైన ప్రాంతాలకు మార్చాలని కేఆర్ఎంబీ 9వ బోర్డు సమావేశంలోనే నిర్ణయించింది. ఇప్పటికే టెలీమెట్రీల ఏర్పాటుకు టెండర్లను పిలిచేందుకు బోర్డు సిద్ధమైంది. ఇందులో రేవంత్‌రెడ్డి కొత్తగా సాధించిందేమిటో మరి.
2) గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణ నది యాజమాన్యబోర్డు ఏపీలో ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం.
ఇది మరీ విచిత్రం. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారమే బోర్డుల ఏర్పాటు జరిగింది. గోదావరి బోర్డును తెలంగాణలో, కృష్ణా బోర్డును ఏపీలో ఏర్పాటు చేయాలని చట్టం ప్రకారమే అనాడే నిర్ణయమైంది. ఏపీనే అనేక సందర్భాల్లో బోర్డును అమరావతికి తరలించాలని బోర్డుకు లేఖ రాసింది. అటు తరువాత విశాఖకు తరలించాలని కూడా పలుసందర్భాల్లో చర్చ కొనసాగింది. ప్రతి బోర్డు సమావేశాల్లోను ఈ విషయమై చర్చ కొనసాగడం, తెలంగాణ అంగీకరించడం పరిపాటిగా కొనసాగుతున్నది.
3) శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం. ఒక విడ్డూరం.
సీఎం రేవంత్‌రెడ్డి సాధించామని చెప్తున్న ఈ విషయమూ అంతే అబద్ధం. ఎందుకంటే తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఏర్పాటు నుంచే నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణ, మరమ్మతుల బాధ్యత తెలంగాణ పరిధిలో ఉన్నది. శ్రీశైలం డ్యామ్ నిర్వహణ మొత్తం ఏపీ పరిధిలో కొనసాగుతున్నది. ఏబీ పాండ్య నేతృత్వంలోని కమిటీ 2021లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల పరిస్థితిని పరిశీలించింది. డ్యామ్ పరిస్థితిపై నివేదికను సమర్పించింది. శ్రీశైలం డ్యామ్ స్పిల్‌వే నుంచి వచ్చే భారీ ప్రవాహానికి 40 మీటర్ల లోతులో ప్లంజ్‌పూల్ గొయ్యి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో స్పిల్‌వే దిగువన భద్రత పనులను వెంటనే చేపట్టాలని, స్కై జంప్ బకెట్‌కు మరమ్మతులు చేయాలని ఆదేశించింది. అందుకు రూ. 800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఏపీ ఇప్పటికే రక్షణ చర్యల పనులను కూడా మొదలు పెట్టింది. ఏపీ చేయాల్సిన మరమ్మతులను తానేదో చేపిస్తున్నట్టు రేవంత్ చెప్పడం విడ్డూరం.
4) ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిషారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో వారం రోజుల్లో కమిటీ నియామకం. నెలరోజుల్లో నివేదిక.
తెలంగాణకు సంబంధించి అనేక జల సంబంధిత అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. పలు ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌తో జలవివాదాలు కొనసాగుతున్నాయి. ఇరు రాష్ర్టాల మధ్య జలవివాదాల పరిష్కారానికి గతంలోనే రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కలిసి ఒక కమిటీ వేయాలని ప్రజాభవన్ వేదికగా నిర్ణయించారు. ఆ కమిటీ సాధించినదేమీ లేదు. తెలంగాణ వివాదాలు పరిష్కారమైందీ లేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా కమిటీ ఏర్పాటు అంటూ రేవంత్‌రెడ్డి ప్రకటించడం విస్మయం గొల్పుతున్నది.