హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నందున నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన మౌ గ్రామంలో సంవిధాన్ బచావో ర్యాలీకి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నేతలు తరలివెళ్తున్నారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. కాగా, ఈ నెల 16 దావోస్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు 9 రోజులు పర్యటించి 25న తిరిగి హైదరాబాద్ వచ్చారు. అదే సమయంలోనే రాష్ట్ర మంత్రివర్గమంతా కర్ణాటక రాష్ట్రం వెళ్లివచ్చింది. తాజాగా మళ్లీ రాష్ట్ర పరిపాలన వదిలేసి పొరుగు రాష్ట్రం బాట పట్టడంపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.