Revant Reddy | ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో ఎనిమిది శాతం ప్రజలు తెలంగాణలో ఉన్నారని సీఎం తెలిపారు. పీఏఎంవై (యూ)తోపాటు పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల పనితీరుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
దేశంలోని మహా నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్-2 కింద ఆరు కారిడార్లను గుర్తించామని మనోహర్‌లాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కారిడార్ -4: నాగోల్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), కారిడార్-5: రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), కారిడార్-6: ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), కారిడార్-7: మియాపూర్-పటాన్చెరు (13.4 కి.మీ.), కారిడార్-8: ఎల్ బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ), కారిడార్- 9: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) (40 కి.మీ.) ఉన్నాయని వివరించారు.
మొదటి అయిదు కారిడార్ల (76.4 కిమీ) కోసం డీపీఆర్‌లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి ఖట్టర్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయమవుతుందన్నారు. డీపీఆర్‌లు ఆమోదించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం (జేవీ) కింద చేపట్టి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కి.మీ. (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు సమీపంలోని 27 పట్టణ పాలక సంస్థల పరిధిలో మురుగు నీటి నెట్వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) తయారు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎస్ఎంపీని గుర్తించి నిధులు సమకూర్చాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. వరంగల్‌లో రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.