రాజకీయ వ్యూహరచన సమావేశం.. రాష్ట్ర ఆర్థికస్థితిపై అవగాహన కార్యక్రమంగా మారింది. స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేద్దామని పెట్టుకున్న పార్టీ భేటీ.. ఆవేదన సభగా ముగిసింది. గురువారం ఎంసీహెచ్చార్డీలో నిర్వహించిన సీఎల్పీ భేటీకి ఫిరాయింపు నేతలు హాజరుకాకపోగా 8 మంది సొంతపార్టీ ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టారు.
Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): కాంగెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ)లో ప్రభుత్వ పెద్దల తీరుపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘మీరు పనులు అడగొద్దు.. మేం నిధులు ఇవ్వలేం’ అని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పడంతో, ‘మీకేం మీరు ఇక్కడ బాగానే చెప్తారు. మేం ఊర్లలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నం.. జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నరు’ అని పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సర్పంచ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలని భావించింది. అయితే, దీనికి హఠాత్తుగా ఆర్థిక అంశం తోడైంది. రాజకీయాలు చర్చించాల్సిన సీఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తద్వారా రాష్ట్రంలో నెలకొ న్న ఆర్థిక సంక్షోభాన్ని వారికి వివరించారు. దీనిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టారు… మొన్న టి సభలోనూ అప్పులు, ఆర్థిక వివరాలను వెల్లడించారు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్లీ సీఎల్పీలో కూడా ఆర్థిక పరిస్థితి వివరించాల్సిన అవసరం ఏమిటనే సందేహాన్ని పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తంచేస్తున్నారు. భట్టి విక్రమార్క పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వెనుక అంతరార్థం వేరే ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. పదేపదే పనులు, నిధులు అడుగుతున్న ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వడానికే ప్రజెంటేషన్ ఇచ్చారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
సీఎల్పీ సమావేశం సాక్షిగా ‘మాకు నిధులు ఇవ్వండి మహాప్రభో..’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదనే ఫిర్యాదులు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రావడం లేదని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
సీఎల్పీ సమావేశం సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలను కడిగిపారేసినట్టు తెలిసింది. ‘మీకేంటి… ఇక్కడ కూర్చొని మస్తుగా చెప్తారు.. ఊర్లల్లో తిరిగే మాకు తెలుస్తుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో’ అంటూ ఒక ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నిధులు ఇవ్వకుండా పనులు ఏవిధంగా చేస్తామని ప్రశ్నించినట్టు సమాచారం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఏడాది పూర్తయినా పాలన ఇంకా గాడిలో పడలేదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పేరు రావడం లేదని, పథకాల్లో అడ్డగోలు కోతలు ప్రభుత్వాన్ని ముంచుతున్నాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. పథకాల్లో కోతలు బంద్ చేయాలని, గతంలో మాదిరిగానే అందరికీ ఇవ్వాలని, రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పినట్టు తెలిసింది.
ముఖ్యంగా రుణమాఫీ, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల్లో కోతలు పెట్టడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఊర్లలోకి వెళ్లాలంటేనే భయంగా ఉన్నదని చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని పలువురు ఎమ్మెల్యేలు కరాఖండిగా చెప్పినట్టు సమాచారం.