హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): నాలుగేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు సూరినేని ఉపేందర్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాలా చంద్రశేఖర్ గుప్తా, సూరినేని ఉపేందర్ తమ ఏజెంట్ల ద్వారా ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన అనేక మందిని మోసగించారు. భారీ రాబడి వస్తుందని నమ్మించి 2017 నుంచి రూ.కోట్లలో డబ్బులు దండుకున్నారు. వీరి మోసాలపై 2020లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టి.. 2021 జనవరిలో చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఉపేందర్ తప్పించుకొని తిరుగుతున్నాడు. సూరినేని ఉపేందర్‌కు మధ్యతరగతి ప్రజల నుంచి కోట్ల రూపాయలు మోసగించిన చరిత్ర ఉన్నట్టు తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భాగవత్ తెలిపారు. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలో సూరాకాశ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో ఉపేందర్ ప్రజలను మోసగించాడని పేర్కొన్నారు.
బెంగళూరులో చంద్రశేఖర్‌తో కలిసి ఎస్ఆర్ బ్లూచిప్స్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్స్ పేరుతో వందల కోట్ల రూపాయల మోసాలకు తెగబడినట్టు వెల్లడించారు. ఈపీసీ ఈ-వాలెట్, డేర్ 2 డ్రీమ్ నెట్వర్క్, తిరుపతిలో బాలాజీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ పేరుతో కూడా ప్రజలను ఉపేందర్ వంచించినట్టు తెలిపారు. కర్ణాటకలో జరిగిన ఆంబిడెంట్ ఫైనాన్షియల్ స్కామ్‌లో చంద్రశేఖర్, ఉపేందర్ సూత్రధారులుగా ఉన్నారు. ఇటు ఈడీ, కర్ణాటక సీఐడీ, వైజాగ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఉపేందర్ కోసం గాలిస్తుండగా.. తెలంగాణ సీఐడీకి చిక్కాడు. ఈ వైట్‌కాలర్ మోసగాడిని పట్టుకునేందుకు అహర్నిశలు శ్రమించిన సీఐడీ పోలీసులను ఏడీజీ మహేశ్ భగవత్ అభినందించారు