హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఎవరో ప్రేరేపిస్తేనో, ఏవో రాజకీయ పార్టీలు ఉసిగొల్పితేనే తాము ఉద్యమాలు చేస్తున్నామంటూ సీఎం రేవంత్రెడ్డి ఆక్షేపించడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది. గురువారం మేడే సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా వెనుక ఎవరూ లేరు. మేము కేవలం మా ఆర్టీసీ కార్మికుల ఆక్రందనలను చూసి, నిత్యం వారు అనుభవిస్తున్న ఇబ్బందులను చూసి, డిపోలలో అధికారుల వేధింపులు, అధిక పనిభారాలు మోయలేక అనారోగ్యాలతో చనిపోతున్న కార్మికులను చూసి, అన్ని సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రికి స్పష్టత ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఆలోచన చేసి సమ్మె చేద్దామని నోటీస్ ఇవ్వలేదనే విషయాన్ని సీఎం గుర్తించాలని హితవు పలికారు.
7 నెలల నుంచి పలుమార్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమారను, రవాణాశాఖ మంత్రిని, ఇతర ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. తమ సమస్యల పరిషారానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, విధిలేని పరిస్థితిలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. ఇంకా ఆరు రోజుల గడువు ఉన్నదని, ఈలోగా ముఖ్యమంత్రి సూచించిన విధంగా తాము ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపడానికి ఎప్పుడు పిలిచిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధంగా ఉన్నదని తేల్చిచెపపారు. సీఎం సూచించిన అంశాలను క్షుణ్ణంగా చర్చించడానికి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ఇన్నాళ్లూ యాజమాన్యం తప్పుడు నివేదికల ద్వారా తప్పుదారి పట్టించిందని, వాస్తవాలను చెప్పేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు.
మేడే రోజున ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తారని ఆశతో ఎదురు చూశామని, ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఆర్టీసీలో సంఘాలు ఉండాలని గతం లో చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ మాటపై నిలబడకపోవ డం అందరికీ అసంతృప్తిగా ఉన్నదని తెలిపారు. కార్మికులు రోజుకు 14 నుంచి 18 గంటలపాటు పనిచేస్తున్నారని, ఒకరోజు కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 16వేల మంది రిటైర్మెంట్ అయితే ఒక నియామకమైన చేపట్టకపోవడం దారుణమని పేర్కొన్నారు.