Telangana CEO Vikas Raj | తెలంగాణలో ఈ నెల 13న 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం పోలింగ్ సందర్భంగా ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడటంతో అభ్యర్థుల కదలికలపై మరింత నిఘా పెరుగుతుందని చెప్పారు.
జూన్ ఒకటో తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం అమల్లో ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకూ రూ.320 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ తనిఖీల విషయమై 8,000లకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారని వికాస్ రాజ్ వివరించారు.