Telangana Cabinet | హైదరాబాద్, నవంబర్ 15, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలసినా ఒకటే చర్చ. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ అని. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న అవకాశం ఎప్పటికి చేతికి అందుతుందో తెలియక ఆశావహులంతా నిట్టూరుస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోయినప్పుడల్లా పదవులు ఖరారు చేసుకుని వస్తారని, ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ వస్తున్నప్పుడు బహుమతులు పట్టుకొస్తారేమో అని భావిస్తున్న నేతలు ఆ ఊసే లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలు ‘మేరా నామ్ కబ్ ఆయేగా’ అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి 24 సార్లు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలతో సమావేశమయ్యారు. సీఎం ఢిల్లీ వెళ్లగానే ఆశావహులంతా హస్తిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ సారి పదవి పక్కా అని అనుచరులతో కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ మాత్రం ఉత్త చేతులతోనే వస్తున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమించినప్పుడు కూడా విస్తరణ ఉంటుందని నేతలు ఆనందపడ్డారు. కానీ అధిష్ఠానం దృష్టి సారించలేదు.
కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తొలుత సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. అదేరోజు 8 మంది మంత్రులను క్యాబినేట్లోకి తీసుకున్నది. 11 రోజుల తర్వాత క్యాబినెట్‌ను విస్తరిస్తూ 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కర్నాటక క్యాబినెట్లో పూర్తిస్థాయిలో 34 మంది మంత్రులు ఉన్నారు. కానీ తెలంగాణలో 11 నెలలు అవుతున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలామంది నేతలు అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి 6 నెలలు దాటింది. విస్తరణకు మాత్రం అడుగు ముందుకు పడలేదు.
కాంగ్రెస్‌లో నేతలు మాత్రం ప్రతీ పండుగకు కొండంత ఆశతో పదవి కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుందని ప్రచారం జరిగింది. శ్రావణం వెళ్లిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా పదవుల ప్రకటన ఉంటుందని సీఎం కార్యాలయమే లీకులు వదిలింది. దీపావళికి ముందు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి విస్తరణపై స్పష్టత తీసుకుని వస్తారని హస్తం నేతలు ఆశలు పెట్టుకున్నారు. కొందరు నేతలైతే ప్రతిపక్షాల మీద పొలిటికల్ బాంబులు, మంత్రి పదవులతో మన మీద పూల మాలలు అనుకుంటూ తమ అనుకూల మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు. ప్రతిపక్షాలపై బాంబులు పేలకపోగా కాంగ్రెస్ నేతల ఆశలు కూడా తుస్సుమన్నాయి.
నెలో రెండు నెలలో అంటే ఓకే కానీ మరీ 11 నెలలు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరగడం లేదా అని కాంగ్రెస్ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఎందుకు ఇవ్వడం లేదనే చర్చ కూడా గాంధీభవన్‌లో జోరుగా జరుగుతున్నది. విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అధిష్ఠానం పెద్దలతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. అయినా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ జరుగుతున్నది. విస్తరణలో పేర్లపై అధిష్ఠానం ఆమోదముద్ర వేయడం లేదా? లేకపోతే సీఎం, మంత్రులు, సీనియర్‌నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా అనే చర్చ కూడా పార్టీలో నడుస్తున్నది. ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే తేలేలా లేదని కొందరు నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఇప్పటికే పలు జిల్లాలకు చోటు దక్కలేదు. దీంతో పాటు కొన్ని కీలక సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయా వర్గాల నేతలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం చూద్దాంలే తొందరేముంది అన్న ధోరణిలో వ్యవహిస్తుండటంతో నేతల్లో నిరాశ తీవ్రమైంది.