Telangana Cabinet | తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలివే..
* రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1వ తేదీ నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను వెంటనే చెల్లిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు బకాయి పడ్డ ఎరియర్స్ ను 28 వాయిదాల్లో చెల్లిస్తారు. మరో డీఏ ను వచ్చే ఏప్రిల్ లో ప్రకటించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్‌కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6 వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించగా.. కొన్నింటిని పరిశీలనకు స్వీకరించింది.
*ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బకాయిలకు ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లించాలని నిర్ణయం.
*ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో డీపీసీ వేయనుంది.
* స్టేట్ లెవల్ మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. జాయింట్ స్టేట్ కౌన్సిల్, అసోసియేషన్లను రికగ్నిషన్ చేసేందుకు ఒప్పుకుంది.
*జీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం
*కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కేబినేట్ నిర్ణయం
* రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం
*సన్నాలకు బోనస్‌తో రైతులకు లబ్ధి చేకూరిందని, సన్న వడ్లకు బోనస్ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయం
* స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు రూ. 38.5 కోట్లు స్త్రీనిధికి కేటాయించాలని నిర్ణయం.
ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా నేరుగా స్త్రీనిధి ద్వారా 385 మంది బాధిత కుటుంబాలకు ప్రమాదబీమా పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయం
పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు..
*రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
HAM (Hybrid Annuity Model) విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు కేబినేట్ ఆమోదం పంచాయతీరాజ్ పరిధిలో 7947 కిలోమీటర్లు, ఆర్ అండ్ బీ పరిధిలో 5190 కిలోమీటర్లు.. మొత్తం 13137 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తుంది.
*పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 16 వేల 780 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 16 వేల 414 కోట్లు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖర్చు పెడుతుంది. హ్యామ్ విధానంలో రెండేండ్లలో నిర్మాణంతోపాటు 15 ఏండ్ల మెయింటెనెన్స్ కూడా ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది.
*పార్లమెంట్ ఒక యూనిట్ గా లేదా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా ఒక్కో ప్యాకేజ్‌గా విభజించి రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం.
*హైదరాబాద్ సిటీలో మెట్రో ఫేజ్ 2B ప్రాజెక్టుకు 86.1 కిలోమీటర్లకు రూ.19579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ తో చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది.
*కారిడార్–1లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ,
*కారిడార్-2 జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ
*కారిడార్-3 జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కి.మీ