హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. వారి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలు రద్దయ్యాయి. దీంతో మరోసారి రాష్ట్ర క్యాబినెట్ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది.
అమీర్అలీఖాన్ను చివరి నిమిషంలో పక్కన పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన ప్రాణ, పంట నష్టం అంచనాల నివేదికను సోమవారంలోగా సిద్ధం చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో గోశాల బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రంలో 2022-23 సీజన్‌కు సంబంధించి మిల్లర్ల నుంచి రావాల్సిన 7 లక్షల టన్నుల బియ్యాన్ని రికవరీ చేయాలని, అందుకు మిల్లర్లు సహకరించకుంటే పీడీ యాక్ట్ పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు.