CS Ramakrishna Rao | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): బహిరంగ సభలు, సమావేశాల్లో హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు. హోదాను కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని తగ్గించుకునేలా వ్యవహరిస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కీలక ఆదేశాలు జారీచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఐఏఎస్ అధికారి, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ సీఎంను ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా ఆయన కాళ్లు మొక్కారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు స్థాయిని మరిచి రాజకీయాల్లో భాగమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎస్ రామకృష్ణారావు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఐఏఎస్‌లను, ప్రభుత్వ ఉద్యోగులను దారిలో పెట్టడమే లక్ష్యంగా ఆదేశాలు జారీచేశారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగ సభలు, సమావేశాల్లో స్థాయికి తగని పనులు చేస్తున్నారని, ఇవి ప్రజల్లో అధికారులపై చులకనభావాన్ని ఏర్పరుస్తున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ 1964 లోని రూల్-3 నిబంధన.. ప్రతి ఉద్యోగి విధికి అంకితమై, సంపూర్ణ క్ర మశిక్షణ, నిష్పక్షపాతంగా పని చేయాలని సూచిస్తుందని, దీన్ని మరువొద్దని సూచించారు. ఇకపై ఐఏఎస్ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సభలు, సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా, హోదాను మరిచి వ్యవహరించినా, మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
షాద్‌నగర్, మే 20 : గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్‌నాయక్ సీఎం రేవంత్ కాళ్లు మొక్కి బంజారా బిడ్డల ఇజ్జత్ తీశారని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శరత్‌నాయక్ వ్యవహరించిన తీరు బంజారా జాతిలో ఐఏఎస్ వ్యవస్థ ప్రాతినిధ్యానికి మాయని మచ్చ అని తెలిపారు. ఇలాంటి చర్యలతో ఐఏఎస్ అయినా.. రాజకీయ నాయకుల కాళ్లు మొక్కాలా ? అనే భావనలో యువత ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. శరత్‌నాయక్ తక్షణమే ఉద్యోగానికి రాజీనా మా చేసి, లంబాడా గిరిజనులకు క్ష మాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.