హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగంతో ఉభయ సభలు మొదలుకానున్నాయి. 28న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 23న క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ సమావేశాల నిర్వహణపై సర్కార్ అధికారికంగా వివరాలు వెల్లడించనున్నది.
ఈసారి సమావేశాల్లో కీలకమార్పు చోటుచేసుకోనున్నది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరుగనున్నాయి. గతంలో వేర్వేరుచోట్ల జరిగినప్పటికీ, ఈసారి మండలి సమావేశాలను పాత అసెంబ్లీ హాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఏడాదిగా పాత అసెంబ్లీ హాల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. రంగులు సహా ఇతర తుదిమెరుగులు దిద్దారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అసెంబ్లీ సిబ్బంది ఇప్పటికే పూర్తిచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ పరిమాణాన్ని భారీగా పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.3.15 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉన్నది. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా ఈ సారి సమావేశాలను 10 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖలతో ప్రీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులు ఆయా శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించగా, ప్రీ బడ్జెట్ సమీక్షల్లో తుది మార్పులు, చేర్పులు చేస్తున్నారు. బడ్జెట్లో విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యమిస్తామని ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.